Manujudai Putti Lyrics in Telugu
మనుజుడై పుట్టి అన్నమాచార్య ద్వారా వేంకటేశ్వర స్వామిపై కీర్తన. ఇందులో అన్నమయ్య సర్వ దయాళుడూ, సుందరుడైన వేంకటేశ్వరుని సేవించకుండా, ప్రాపంచిక ప్రయోజనాల కోసం ఇతరులకు సేవ చేసే మూర్ఖత్వాన్ని ఖండిస్తున్నాడు. వేంకటేశ్వరుని అనుగ్రహం కోసం పఠించండి.
మనుజుడై పుట్టి మనుజుని సేవించి
మనుజుడై పుట్టి మనుజుని సేవించి
అనుదినమును దుఃఖమందనేలా ||
జుట్టెడు కడుపుకై చొరని చోట్లు జొచ్చి
పట్టెడు కూటికై బతిమాలి |
పుట్టిన చోటికే పొరలి మనసువెట్టి
వట్టి లంపటము వదలనేరడుగాన ||
అందరిలో పుట్టి అందరిలో చేరి
అందరి రూపములటు తానై |
అందమైన శ్రీ వేంకటాద్రీశు సేవించి
అందరాని పద మందెనటుగాన ||
భావము:- మనిషిగా పుట్టి మనిషిని సేవిస్తూ ప్రతిరోజు దుఖం పొందడం ఎందులకు నాయనా ? ఈ చిన్న కడుపు నింపడానికి చొరబడలేని చోట్లు దూరి, పట్టెడన్నం కోసం పడరాని పాట్లు పడి, ఎంతో మందిని బతిమాలుతూ, కామ సుఖానికి (పుట్టిన చోటికే పొరలి మనసు వెట్టి) వెంపర్లాడుతూ ఈ అనవసరమైన ప్రయోజనం లేని బాధలు వదులుకోలేడు లేడు కదా!. అందరిలో ఉన్న, అందరిలో పెరుగుతున్న, అందరి రూపములు తానే అయి ఉన్న అందమైన శ్రీ వేంకటాద్రీశుని సేవించి, అంత సులభంగా అందుకోలేని మోక్షపదాన్ని అందుకోవచ్చు కదా!! శ్రీ వెంకటేశా నారాయణ
అయ్యా మరిన్ని కీర్తనలు చదవండి :శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం