varalakshmi vratham in telugu
అనుకున్న అన్ని కోరికలూ వరాలరూపంగా సిద్ధించాలని ప్రార్థిస్తూ, శ్రావణమాసంలో పూర్ణిమకు ముందొచ్చే శుక్రవారంనాడు చేసేపూజ ‘వరలక్ష్మీపూజ’. ఈ వరలక్ష్మీపూజలో ఒక్కమారుమాత్రమే కాకుండా, జీవితాంతమూ నేను చేస్తూ ఉంటానని మొదటిసారి పూజలో ప్రమాణం చేసిన కారణంగా ఈ వరలక్ష్మీ పూజే వరలక్ష్మీ వ్రతంగా అయింది. అలాంటి ఈ వ్రతంలో ఏం చెయ్యాలో తెలుసుకుందాం పదండి !
ఇది ఓ వ్రతం కాబట్టి శాశ్వతంగా ఉండే విగ్రహానికి కాకండా, బిందెమీద కొబ్బరికాయ పెట్టి, చక్కగా అలంకరించి కూర్చున్న లక్ష్మీదేవిలా ఓవిగ్రహాన్ని సిద్ధం చేసి, ఆమెను ఒక ప్రక్కన ఉంచాలి.
ఇంటికి నట్టనడిమిభాగంలో మంచిపీట వేసి, నూతన వస్త్రాన్ని పరిచి, బియ్యం పోసి, నలుచదరంగా చేసి, దానిమీద పసుపువినాయకుణ్ణి పెట్టి, గణపతిపూజను పంచోపచారాలతో (స్నానం – పూజ – నైవేద్యం – ప్రదక్షిణం నమస్కారం) ముగిం చాలి. ఇక్కణ్ణుంచి వరలక్ష్మీవ్రతం ప్రారంభమౌతుంది. పీట పద్మదళాలను గానీ, పంచపల్లవాల్ని (మర్రి – -మామిడి – మేడి – రావి – జువ్వి చెట్ల చిగురుటాకులు) గానీ . ఇక్కడ ఆ లక్ష్మీదేవిని కూర్చోబెట్టబోతున్నా మన్నమాట.
ఆవాహనం:-
మనం ధ్యానించుకునేందుకు వీలుగా ఏ ఆకారమూ లేని పరమాత్మస్వరూపానికి మనలాంటి ఆకారాన్ని కల్పించి, ‘ఆవాహన’ చెయ్యడం దీనిభావం. ఆవాహన మంత్రం చదివామంటే మనం సిద్ధం చేసిన ఆ విగ్రహంలోనికి ధ్యానించబోయే ఆ తల్లిరూపం చేరినట్లు భావించాలి.
ఆసనం:-
అప్పుడు ఆ తల్లికి ఆసనాన్ని సమర్పించాలి. పద్మదళా లేదా పంచపల్లవాలున్నఆసనం ఆమెకిష్టం. ‘ఎప్పుడూ శ్రీమహావిష్ణువక్షఃస్థలమే నివాసంగా ఉన్న “తల్లీ! ఈ ఆసనాన్ని ‘ అనే అర్థముండే మంత్రాన్ని చదివి ఆమెను ఈ పీటమీద భక్తిశ్రద్ధలతో కూర్చోబెడతాం. ‘నట్టింటసిరి’ ఉండడం అంటే ఇదే!
పాద్యం: –
‘ఎప్పుడూ కల్పవృక్షపుష్పాలమీదనే నడిచేతల్లీ! నీ సుకుమారపాదాల్ని మా భూలోకజలంతో కడుగుతున్నా’ నంటూ పాదాల్ని కడగడం పాద్యం.
అర్ఘ్యం:–
దేవతాస్త్రీలనందరినీ ఆశీర్వదించే చేతులతోనూ బ్రహ్మ ఇంద్ర రుద్రులక్కూడా సంపదల్ని అనుగ్రహించేహస్తాలతో ప్రకాశించేతల్లీ! నీ హస్తాలకు పవిత్ర జలాన్ని సమర్పిస్తున్నా నంటూ గౌరవపూర్వకంగా జలాన్నియ్యడం అర్ఘ్యం
ఆచమనం:-
‘శుద్ధమైన ఆకాశగంగా జలాన్నిమాత్రమే స్వీకరించే నీకు, నా యథాశక్తి లభించినజలాన్ని ఇస్తున్నా’ నంటూ తాగడానికి ఆమెకు అందిచ్చేజలం ‘ఆచమనం’
శుద్ధమైన ఆకాశగంగా జలాన్నిమాత్రమే స్వీకరించే నీకు, నా యథాశక్తి లభించినజలాన్ని ఇస్తున్నా’ నంటూ తాగడానికి ఆమెకు అందిచ్చేజలం ‘ఆచమనం’. మన శరీరాలన్నీ నీళ్లు ప్రధానంగా ఉండి జీవించేవి. ఆ తల్లిని మనలాంటి జలమయశరీరంలోనికి ఆవాహనం చేశాం కాబట్టి, శరీరంలో దిగువభాగమైన పాదాలకూ, మధ్యభాగమైన హస్తాలకూ-ఊర్ధ్యభాగమైన ముఖానికీ జలాన్ని అందిస్తూలక్ష్మీదేవినికూడా మనలో ఉన్న ఒక స్త్రీగా భావిస్తూ పూజిస్తున్నాం.
అభిషేకం లేదా స్నానం:-
ఇటు వైప అటు వైపూ చెరొక ఏనుగూ వాటితొండాల్లో మానస సరోవరజలం నిండిన బంగారుకుండలూ వాటితో నిత్యాభిషేకాన్ని చేయించుకునే తల్లీ! నాకు లభించినంతలో ఉత్తమజలంతో అభిషేకిస్తున్నా’నంటూ స్నానాన్ని చేయిం చాలి – తల్లికి.
వస్త్రం:-
మరింతతెల్లగా ఉండేవస్త్రాన్ని సమర్పిస్తూ ‘ఏ విధమైన హింసనూ చేయ కుండా, లభించే అహింసా పట్టువస్త్రాల్ని ధరించే తల్లీ! దీన్ని స్వీకరించు’ అని ప్రార్థిం చాలి. (మామూలు పట్టువస్త్రాలన్నీ పట్టుపురుగుల్ని వేడినీళ్లలో వేసి, చంపగా వచ్చేవే అందుకే వీటి పేరు హింసాపట్టువస్త్రాలు.)
ఉపవీతం:-
పురుషదేవతలకైతే యజ్ఞోపవీతాన్నిస్తారు. స్త్రీదేవతలకైతే ఉత్తరీయాన్నిస్తారు. ఉత్తరీయమంటే భుజంమీద కప్పుకునే మరో వస్త్రమని అర్థం. ఇది అసహజం కాదుకాబోదు. శ్రీమద్రామాయణంలో సీతమ్మ తన భుజమ్మీది ఉత్తరీయంలోనే నగల్ని మూటగట్టి కింద పడవేసింది. ప్రాచీనదేవతావిగ్రహాల్ని పరిశీలిస్తే భుజంమీద ఉత్తరీ యాన్ని చెక్కినట్లు కన్పిస్తాయి.
ఇలా ఉత్తరీయాన్ని ఇయ్యడమనే ఆచారాన్ని వెనక్కిపెట్టినందువల్లే, స్త్రీలు యజ్ఞోపవీతాల్ని ధరించడం – సంధ్యాకాలంలో తనకు నిత్యనియమంగా ఉన్న జపాన్ని సీతమ్మ చేస్తే ఆమె సంధ్యావందనాన్ని చేసేది కాబట్టి (సంధ్యాకాలమనాః….) మేమూ ఓ యజ్ఞోపవీతాన్ని ధరించి, సంధ్యావందనం చేస్తామని వాదులాడడం వంటివి జరుగుతున్నాయి.
గంధ – పుష్ప-అక్షతలు:-
ఆ తల్లికి గంధాన్ని పూయడం లేదా చల్లడం. పూసి నప్పుడున్న దానికంటె ఆరినకొద్దీ సువాసననిస్తుంది గంధం. గంధంలా కాక, అలంకరించినప్పటికంటే కాల క్రమంలో వాడుతూపోతాయి పుష్పాలు. ఇలా గంధంలా పెరగడం, అలా పుష్పాల్లా తరగడం కాక శాశ్వతంగా ఉండేవి “అక్షతలు” అమ్మవారిపాదాలమీద సమర్పించాలి.
తర్వాత ‘అష్టోత్తర శతనామ అంగ – తోరగ్రంథి’ పూజలు గొప్పతనాన్ని వర్ణిస్తూ ఆమె మనకు కలిగించే నూట ఎనిమిది ప్రయోజనాల్ని వివరించే పూజ – అష్ట + ఉత్తర + శతనామ (108) పూజ.
ఇంత గొప్పతనం ఉన్న ఆ తల్లి దేవలోకానికి సంబంధించిందిమాత్రమే’ అనుకోకండా ‘అంగపూజ’ చేస్తాం. పాదాల నుంచి తలవరకూ ఉండే భాగాలనన్నిటినీ స్మరిస్తూ చేసేపూజ ఇది. ఈ పూజ చేసినకారణంగా మనం అనుకోవాలి ఈ పూజనందుకునేలక్ష్మీదేవి మాలాగే ఓ స్త్రీయే – అయితే మనకంటే పూజ్యురాలు’ అని. దీనివల్ల ఆమెతో మనకు దగ్గరతనం ఏర్పడుతుంది. –
పిదప ‘తోరగ్రంథిపూజ’. ఏ లక్ష్మీదేవిని మనమిక్కడ ఆరాధించామో ఆ తల్లిని మనలా స్థూలశరీరం కలదాన్నిగా భావిస్తూ, ఆ శరీరం ఆకారంలోనే నిలువుగా తొమ్మిది దారాలను ఒకటిగా కలిపి, వాటికి తొమ్మిదిచోట్ల ముడివేస్తూ, ప్రతిముడిలోనూ ఓ పువ్వును ఉంచి, ఆ తోరానికి పూజ చేసి, చేతికి కట్టుకుంటాం. అంటే, ఈ లక్ష్మికి ఈ వరలక్ష్మీవ్రతం అయ్యాక వీడ్కోలు చెప్పం. అంతటితో ఈ వరలక్ష్మీవ్రతం ముగియలేదనీ, ప్రతి సంవత్సరం నేను చేస్తూనే ఉంటాననీ చెప్పడమన్న మాట.
ఆ లక్ష్మీరూపం ఈ తోరం (నా స్థూలదేహం)తో కూడిన గ్రంథుల్లో (శరీర రానికున్న ముడులలో) ఉందనీ, ఆ కారణంగా లక్ష్మీదేవి నా కుడిచేతిమణికట్టుకు నిత్యం ఉందంటే ఆమె సన్నిహితంగా నాకుందన్న మాటేనని భావించడం దీని తాత్పర్యం. (శరీరానిక్కూడా నవ (9) గ్రంథులే ఉంటాయని ఆయుర్వేదశాస్త్రం.)
వ్రతకథ:-
మగధదేశంలో ‘కుండిన’ అనే పేరున్ననగరంలో చారుమతి అనే ఆమెకు కలలో లక్ష్మీదేవి కన్పించడం – శ్రావణంలో పూర్ణిమకు ముందువచ్చే శుక్రవారంనాడు వరలక్ష్మీపూజ చేసుకోవలసిందని ఆమెకు చెప్పడం – తానొక్కతె మాత్రమే ఆ ఆనందాన్ని అనుభవించడంకంటే పదిమందితో పాలు పంచుకోవాలని భక్తిశ్రద్ధలతో తోటిముత్తైదువులతో ఆమెపూజ చేయడం – పూజానంతరం ఒక్కో ప్రదక్షిణానికీ ఒక్కొ క్కటి చొప్పున మూడు ప్రదక్షిణాల్లోనూ క్రమంగా బంగారు గజ్జలూ- హస్తకంకణాలూసర్వాభరణాలూ వాళ్లందరికీ లభించడం –
ప్రతిసంవత్సరం ఈ పూజ చేస్తూ, దీన్ని ఓ ‘వ్రతం’గా మార్చుకోవాలనివాళ్లంతా అనుకోవడ మనే ఇదంతా వ్రతకథ.
ఒక్కరే కాకండా పదిమందీ కలిసి పూజ చేసు కోవడంలో ఓ ఆనందం, అంతా ఒక్కచోట కలిసి భుజిం చడంలో ఓ సంతోషం, అలంకరించుకున్న అందర్నీ అందరూ చూసుకోవడం పలకరించుకోవడంలో ఓ ధైర్యవిధానం, మాన సికప్రశాంతత అన్నీ లభిస్తాయి.
షోడశ (16) ఉపచారాల్లో వ్రతకథ భాగం కాదు. కాబట్టి కథ అయ్యాక దేవతకిచ్చే ధూపం – దీపం – నైవేద్యంతాంబూలం అనేవి క్రమంగా పదకొండునుంచి పద్నాలుగు వరకూ ఉండే ఉపచారాలు అవుతాయి. నీరాజనమంత్రపుష్పాలు రెండూ కలిపి పదిహేనవఉపచారం.
తాను ఆరిపోతూ వెలుగు ప్రసాదించేదీ, అమ్మకున్న ముఖసౌందర్యాన్ని ఇనుమడింపచేస్తూండేదీ, తనలోని పర మాత్మను దర్శించాలని చెప్పేదీ, తిరిగి పైసంవత్సరం తప్పక పూజ చేసుకోవాలనే బుద్ధిని కల్గించేదీ, క్రిముల్ని హరించి సువాసన నింపేదీ నీరాజనం, కర్పూరంలాగే, వ్యక్తి ఆయుస్సు తరుగుతున్నా తనప్రకాశంలాగానే వ్యక్తికున్న ప్రతిభ కాంతి మంతంగా వెలుగుతూ ఉండాలనేది దీనిభావం.
ఇప్పటివరకూ పూజచేసిన ఏ పరమాత్మస్వరూపం ఓ దేవిగా మనముందుందో ఆ రూపం మనశరీరంలోనే ఉందంటూ వివరించి చెప్పేది మంత్రపుష్పం.
ఇంతటి దేవి మనలోనే ఉన్నప్పుడు మనం ఆ భక్తిశ్రద్ధలతో ప్రదక్షిణం చేయాలనుకుంటూ చేసే ఆత్మప్రదక్షిణంతో కూడిన నమస్కారం (తన చుట్టూ తానూ తిరుగుతూ నమస్కరిస్తూ ఉండడం). ఇది పదహారవఉపచారం. వ్రతం చేసుకునే వీలూ, శ్రద్ధా లేకపోయినా కనీసం సంప్రదాయానికి అర్థాన్నైనా తెలుసుకుంటే ఇష్టపడుతుంది అమ్మ.
చివరికి వాయనాన్నిస్తూ “ఓ తోటిముత్తైదువా! ఈ వ్రతమంతా అయ్యాక నువ్వూ లక్ష్మివే. నేనూ లక్ష్మినే. మనందరిలోనూ లక్ష్మి ఉందని గ్రహించాను. మనచేతితోరాల్లో లక్ష్మి ఉండి, మనకు శుభాల్ని కల్గి స్తుందనీ అర్థం చేసుకున్నాను. కాబట్టి దీన్ని లక్ష్మీ స్వరూపిణివై స్వీకరించు! అనే అర్థం ఉన్న ఈ శ్లోకాన్ని చదువుతూ వాయనమియ్యాలి.
ఇందిరా ప్రతిగృష్ణతి ఇందిరా వై దదాతి చ।
ఇందిరా తారికా ద్వాభ్యామ్ ఇందిరాయై నమో నమః ॥
‘అఖండలక్ష్మీప్రాప్తి రస్తు – సమస్తసన్మంగళాని భవంతు.’
Also read : లక్ష్మీ అష్టోత్తర శతనామావళిః
1 thought on “varalakshmi vratham in telugu – వరలక్ష్మి వ్రతం పూజా విధానం”