Vasantha Panchami 2022 – ‘వసంత పంచమి’

YouTube Subscribe
Please share it
5/5 - (2 votes)

Vasantha Panchami

వసంత పంచమి

మాఘ మాస శుక్ల పంచమి ‘వసంత పంచమి’.అంటారు. ఇది ప్రసిద్ధమైన పర్వదినం. దీనికే ‘శ్రీపంచమి’ అని కూడా అంటారు. ఈ రోజున జరిగే ఉత్సవాన్ని ‘సారస్వతోత్సవం’ అంటారు. ‘వాగీశ్వర జయంతి’ అని కూడా ఈ రోజున పిలుస్తారు.    సరస్వతీ దేవి విద్యకు, బుద్ధికి, జ్ఞానానికి, వాక్కుకు అధిష్ఠాన దేవత. శారదాదేవి మూల స్థానం ‘శశాంక సదనం’  అంటే అమృతమయమైన ప్రకాశ పుంజమే సరస్వతీ దేవి మూలస్థానమని చెప్పబడుతుంది. అక్కడ నుండే ఉపాసకులకు నిరంతరం వర్ణమాలా క్రమంలో, అక్షర సమూహంతో జ్ఞానామృతం ప్రవహిస్తుంది. ఆమెయే శబ్ద బ్రహ్మ రూపంలో స్తుతింపబడుతుంది.

        సృష్టి ప్రారంభమైన సమయంలో ఈశ్వరుడు తన ఇచ్ఛచేత ఆద్యాశక్తిని తనకు తానే ఐదు భాగాల్లో విభక్తం చేయబడింది. శ్రీకృష్ణభగవానుని విభిన్న అంగాల నుండి ఐదు మంది దేవతలు ప్రకటితమయ్యారు. వారు రాధాదేవి, పద్మ , సావిత్రి, దుర్గ, సరస్వతి. ఆ సమయంలో శ్రీకృష్ణుని కంఠం నుండి ఉద్భవించిన దేవి సరస్వతి. ఈ సంగతి బ్రహ్మవైవర్త పురాణంలో స్పష్టంగా చెప్పబడింది. సరస్వతీదేవి తెల్లని వర్ణం కలిగి, వీణా పుస్తకధారిణియై కమలంలో కూర్చుని, హంసవాహినియై ఉంటుంది. సత్వ గుణ సంపన్నురాలు సరస్వతీ మాత. మన మాట, పలుకు సరస్వతీదేవి స్వరూపమే. అందుకే ‘పలుకులమ్మ’ అంటారు.

         సరస్వతీదేవి ఆవిర్భావమైన వసంత పంచమి నాడు ప్రతి ఒక్కరూ వాగ్దేవతను పూజించాలి. విశేషంగా సరస్వతీదేవి అర్చనతో విద్యా బుద్ధులు, జ్ఞానం సంపూర్ణంగా లభిస్తాయి.

         పిల్లలకు అక్షరాభ్యాసం చేయడానికి ఈ తిథి చాలా ముఖ్యమైంది.

‘మాఘస్య శుక్ల పంచమ్యాం విద్యారంభ దినేఽపిచ౹

పూర్వేఽహ్ణి సంయమం కృత్వా తత్రాహ్నే సంయతః శుచిః౹౹’

అని బ్రహ్మవైవర్త పురాణం చెబుతుంది.

“సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణీ౹

విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా||”

          ఇది సరస్వతీదేవి ధ్యాన శ్లోకం. దీనిని తప్పక పఠించాలి.

         మాతృ గర్భం నుండి పుట్టగానే కేక వేయడం సరస్వతీ దేవి అనుగ్రహమే.

         ఆమె లేకపోతే అసలు లోకంలో శబ్దమే లేదు. శబ్ద బ్రహ్మగా, ధ్వనికర్తగా, వాక్కుకు అధిష్ఠాన దేవతగా విద్యను, బుద్ధిని, జ్ఞానాన్ని ప్రసాదించే ఆ సరస్వతీదేవిని వసంత పంచమి నాడు శ్రద్ధాభక్తులతో పూజించాలి.

★★★సరస్వతీ పూజ★★★

మాఘ శుద్ధ పంచమి నాడు ప్రాతఃకాలమే నిద్రలేచి, నిత్యకృత్యాలు పూర్తి చేసుకోవాలి. మనసులో సరస్వతీదేవిని ధ్యానించాలి.

        పూజా స్థానంలో సరస్వతీదేవి చిత్రపటం లేదా ప్రతిమను ఉంచి పూజించాలి. “శ్రీ సరస్వత్యై నమః” అని చెబుతూ ఒక్కో ఉపచారాన్ని దేవికి సమర్పించాలి. ఉపచారాలను ప్రారంభించే ముందు సరస్వతీమాతను ధ్యానం చేయాలి.

          దేవికి నివేదనగా పాలు, పెరుగు, వెన్న, తెల్లని నువ్వులతో చేసిన లడ్డూలు, చెరకు రసం, తేనె, తెల్లటి పుష్పాలు, అక్షతలు, శ్వేత వస్త్రం సమర్పించి పూజించాలి. సరస్వతీదేవి స్వరూపంగా గ్రంథాలు, విద్యార్థుల పాఠ్య పుస్తకాలు, ఇతర పుస్తక సామగ్రి, కలాలను పూజించాలి.

★★★సరస్వతీదేవి ద్వాదశ నామస్తోత్రం★★★

ప్రథమం భారతీ నామ, ద్వితీయం చ సరస్వతీ |

తృతీయం శారదాదేవి, చతుర్థం హంసవాహినీ ॥

పంచమం జగతీఖ్యాతా, షష్ఠం వాగీశ్వరీ తథా |

సప్తమం కుముదీప్రోక్తా, అష్టమం బ్రహ్మచారిణీ ॥

నవమం బుద్ధిధాత్రీచ, దశమం వరదాయినీ |

ఏకాదశం చంద్రకాంతిః, ద్వాదశం భువనేశ్వరీ ॥

ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః |

జిహ్వగ్రేవసతే నిత్యం బ్రహ్మరూపా సరస్వతీ ||

ఈ ద్వాదశ నామ స్తోత్రం పఠించడం వలన సరస్వతి అనుగ్రహం లభిస్తుంది.

Also read : మకర సంక్రాంతి

 

Please share it

Leave a Comment