Karthika Puranam Day 10 in Telugu
కార్తీక పురాణం 10వ రోజు కథ
ఏకోనవింశాధ్యాయము
జ్ఞానసిద్ధుడు ఉవాచ:-
వేదాలను సంపూర్ణంగా తెలిసిన వేదవేత్తలచే వేదవేద్యుడనూ, వేదాంతంలో స్థితుడనూ, రహస్యమూర్తినీ, అద్వితీయుననీ కీర్తింపబడిన వాడా! సూర్యుడు, చంద్రుడు, శివుడు, బ్రహ్ముడు, మహారాజాధిరాజులచే స్తుతింపబడే అందమైన పాదపద్మాలను కలవాడా! నీకు నమస్కారము.
పంచభూతములు, సృష్టిలోని సమస్త చరాచరములు నీ విభూతులే. శివుని సేవింపబడిన చరణములు కలవాడా! నీవు పరమానందమునకు మించిన పరముడు. నీవే సర్వాధిపతి. స్థావరజంగమములైన సమస్త ప్రపంచమూ, దానికి మూలమైన మాయతో సహా, నీలోనే ప్రత్యక్షమవుతోంది. సృష్టి ఆరంభం నుంచీ, మధ్యలోనూ, అంతమున కూడా నీవే వ్యాపించివున్నావు.
భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్యముల రూపములలో నీవే ఉన్నావు. యజ్ఞస్వరూపుడవూ నీవే. అమృతమయుడవూ, పరమసుఖప్రదుడవూ అయిన నీ సచ్ఛిదానంద స్వరూప సంస్మరణ మాత్రముచేతనే ఈ సంసారం ‘వెన్నెలలో సముద్రము’ వంటి మాయప్రతిభాసమై కనిపిస్తోంది.
ఓ ఆనందసాగరా! ఈశ్వరా! జ్ఞానస్వరూపా! సమస్తానికీ ఆధారుడవూ, సకల పురాణసారమైన వాడవూ నీవే. ఈ విశ్వమంతా నీ వల్లనే ఉద్భవించి, తిరిగి నీలోనే లయమవుతోంది. ప్రాణులందరి హృదయాలలో వున్న ఆత్మస్వరూపుడవు నీవే. మనోవాగ్గోచరుడవైనా నీవు భౌతిక నేత్రములతో దర్శనమివ్వవు గదా తండ్రీ!
ఓ కృష్ణా! ఈశ్వరా! నారాయణా! నీకు నమస్కారము. నీ దర్శనఫలముతో నన్ను ధన్యునిగా చేయు. దయామయుడవై నన్ను ఎల్లప్పుడూ రక్షించు. జగదేకపూజ్యుడవైన నీకు మ్రొక్కినద్వారా నా జన్మ సార్థకమవనుగ్రహించు. ఓ కరుణాసముద్రుడా! సంసారసాగరములో మునిగిన నన్ను రక్షించు.
భక్తి స్తోత్రము:-
హే శుద్ధచరితా! ముకుందా! త్రిలోకనాథా! అనంతా! ఆదికారణా! పరమాత్మా! పరమహంసవతీ! పూర్ణాత్మా! గుణతీతా! గురువర్యా! దయామయా విష్ణో! నీకు నమస్కారము. నిత్యానందసుధాసాగరా! స్వర్గాపవర్గప్రదా! తేజోమయా! సాధు హృత్పద్మస్థితా! ఆత్మారామా! దేవదేవేశా! గోవిందా! నీకే నా ప్రణామాలు.
సృష్టి, స్థితి, లయకర్తవైన వైకుంఠవాసుడా! జ్ఞానులు నీ పాదభక్తినే పడవగా చేసుకుని సంసారసాగరాన్ని దాటి నీ సారూప్యాన్ని పొందుతున్నారు. అటువంటి తేజోమయమైన నీ పాదాలకు నా వందనాలు.
వేదాలు, శాస్త్రాలు, పురాణాలు లేదా న్యాయతర్కములచేత మానవులు నిన్ను తెలుసుకోలేరు. నీ పాదసేవభక్తి రూపమైన అంజనమును ధరించినవారే నీ రూపమును గ్రహించి ఆత్మస్వరూపునిగా తెలుసుకొని తరించగలుగుతారు.
ప్రహ్లాదుడు, ధ్రువుడు, మార్కండేయుడు, విభీషణుడు, ఉద్ధవుడు, గజేంద్రుడు వంటి అనేక భక్తులను రక్షించిన నీ నామస్మరణ మాత్రముచేతనే పాపములన్నియు నశిస్తాయి.
ఓ కేశవా! నారాయణా! గోవిందా! విష్ణూ! మధుసూదనా! త్రివిక్రమా! వామనా! శ్రీధరా! హృషీకేశా! పద్మనాభా! దామోదరా! సంకర్షణా! వాసుదేవా! నీకు నమస్కారము. నన్ను రక్షించు.
విష్ణు ప్రసన్నత:-
జ్ఞానసిద్ధుని ఆత్మీయ స్తోత్రం విని విష్ణుమూర్తి చిరునవ్వుతో ఇలా అన్నాడు:
“జ్ఞానసిద్ధా! నీ స్తోత్రం నన్ను సంతోషపరచింది. ఏ వరమయినా కోరుకో.”
జ్ఞానసిద్ధుడు నమస్కరించి ఇలా అన్నాడు:
“హే జగన్నాథా! నాపై నీ అనుగ్రహం ఉంటే, నాకు సాలోక్యమనే వైకుంఠప్రాప్తిని ప్రసాదించు.”
అప్పుడు శ్రీహరి సంతోషభరితుడై “తథాస్తు” అని దీవించి ఇలా అన్నాడు:
“జ్ఞానసిద్ధా! నీ కోరిక నెరవేరుతుంది. అయితే, పాపాత్ములతో నిండిన ఈ నరలోకంలో మహాపాపులు కూడా సులభంగా తరించేందుకు ఒక సూత్రాన్ని చెబుతున్నాను విను.
నేను ప్రతి ఆషాఢశుద్ధ దశమినాడు లక్ష్మీసమేతుడై పాలసముద్రంలో శయనమై, కార్తీకశుద్ధ ద్వాదశినాడు మేల్కొంటాను. ఈ నిద్ర కాలములో ఎవరైతే చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరిస్తారో వారు విగతపాపులై నా సాన్నిధ్యాన్ని పొందుతారు.
జ్ఞానులైన నీవు, వైష్ణవులతో కలిసి ఈ చాతుర్మాస్యవ్రతాన్ని ఆచరించు. దీనిని నిర్వర్తించని వారు బ్రహ్మహత్య సమానమైన పాపఫలాన్ని అనుభవిస్తారు.
నిజానికి నాకు నిద్ర, మెలకువ, కల వంటి అవస్థలు లేవు. నేను అవన్నిటికీ అతీతుడను. కాని నా భక్తులను పరీక్షించటానికే నిద్రామాయతో జగన్నాటకాన్ని చూచుతాను.
నీవు నాపై చేసిన ఈ స్తోత్రాన్ని త్రికాలములందు పఠించే వారూ తరించెదరు. వీటిని లోకమంతట ప్రచారం చేసి ప్రజలకు ఉపకారం చేయు.”
ఇలా చెప్పి ఆదినారాయణుడు లక్ష్మీసమేతుడై ఆషాఢశుక్ల దశమినాడు పాలసముద్రాన్ని చేరి శేషతల్పముపై శయనమయ్యాడు.
అంగీరస ఉవాచ:-
“ఓయీ! నీవడిగిన చాతుర్మాస్య వ్రతమహిమ ఇదే. దురాత్ములైన, పాపులైన వారు కూడా హరిపరాయణులై ఈ వ్రతాన్ని ఆచరించునట్లయితే బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్ర, స్త్రీ , అందరూ తరించెదరు.
ఈ వ్రతాన్ని చేయని వారు గోహత్య, గోత్రహత్య, సురాపానాదిపాపముల ఫలాన్నీ పొందెదరు. కానీ శ్రద్ధాభక్తులతో ఆచరించిన వారు వంద యజ్ఞముల ఫలాన్నీ చివరికి విష్ణులోకమునందు స్థానం పొందెదరు.”
ఏకోనవింశోధ్యాయసమాప్తః
(పందొమ్మిదవ అధ్యాయం ముగింపు)
వింశాధ్యాయము:-
జనకుని కోరికపై వశిష్ఠుడు ఇలా చెప్పసాగాడు:
“ఓ మిథిలారాజా! కార్తీకమాసమహాత్మ్యమును గురించి అత్యగస్త్యమునుల మధ్య జరిగిన సంభాషణను తప్పక తెలుసుకో.
ఒకనాడు అత్రిమహర్షి, అగస్త్యమునిని ఉద్దేశించి ఇలా అన్నాడు:
‘ఓ కుంభసంభవా! లోకత్రయోపకారార్థముగా కార్తీకమాసమహిమను తెలిపే హరిగాధను నీకు వినిపిస్తాను విను. వేదముతో సమానమైన శాస్త్రమూ లేదు, ఆరోగ్యానందముతో సమానమైన సుఖమూ లేదు, హరికి సాటి దేవతా లేదు, కార్తీకముతో సమానమైన మాసమూ లేదు.
కార్తీకస్నానములు, దీపదానములు, విష్ణుపూజలు – ఇవన్నీ సమస్త వాంఛలను నెరవేర్చును. ముఖ్యంగా కలియుగంలో మానవులు విష్ణుభక్తివలననే విజయ, వివేక, విజ్ఞాన, యశస్సు, ప్రతిష్ఠ, సంపత్తులను పొందుదురు. దానికి సాక్ష్యంగా పురంజయుని ఇతిహాసాన్ని చెబుతాను.
పురంజయోపాఖ్యానము:-
త్రేతాయుగంలో సూర్యవంశానికి చెందిన క్షత్రియుడైన పురంజయుడు అయోధ్యను పాలించేవాడు. సర్వశాస్త్రవేత్త, ధర్మజ్ఞుడు అయిన అతడు అపార ఐశ్వర్యంతో అహంకారిగా మారి బ్రాహ్మణద్వేషి, దేవభూమిహర్త, సత్యశౌచరహితుడు, దుష్టపరాక్రమి, దుర్మార్గవంతుడుగా ప్రవర్తించాడు. దాంతో అతని ధర్మబలం క్షీణించి, కాంభోజ, కురుజాదుల వంటి సామంతులు ఏకమై చతురంగసేనలతో వచ్చి అయోధ్యను ముట్టడించారు.
ఈ వార్త తెలిసిన పురంజయుడు, శత్రువులతో యుద్ధానికి సిద్ధమయ్యాడు. ప్రకాశవంతమైన చక్రాలతో, పతాకలతో అలంకరించబడిన, ధనుర్బాణాదులతో నిండి, అనేక యుద్ధాలలో విజయాన్ని సాధించిన సుందరరథముపై అధిరోహించి, రథ, గజ, తురగ, పదాతి అనే నాలుగు దళాలతో నగరము విడిచి శత్రు సైన్యంపై దాడి చేశాడు.
సమాప్తి:-
ఈ విధంగా శ్రీ స్కాందపురాణాంతర్గత కార్తీకమహాత్మ్యంలో ఏకోనవింశతి, వింశతి అధ్యాయములు – దశమదిన పారాయణముగా సమాప్తము.
Aslo read : కార్తీకపురాణం 8వ రోజు కథ





