karthika puranam day 12 in telugu-కార్తీక పురాణం 12వ రోజు కథ

YouTube Subscribe
Please share it

karthika-puranam day 12 in telugu

కార్తీక పురాణం 12వ రోజు కథ

అత్రి మహర్షి అగస్త్యునితో ఇట్లు పలుకుచున్నాడు: “ఓ అగస్త్యా! కార్తీకమాస శుక్ల పక్ష ద్వాదశికి ‘హరిభోధిని’ అని పేరు. ఆ ఒక్క పవిత్ర తిథినాడు వ్రతమాచరించినచో, సకల తీర్థములలో స్నానమాడిన పుణ్యము, అన్ని రకాల యజ్ఞములు చేసిన ఫలము దక్కుతాయి. ఇది విష్ణుమూర్తి పట్ల, ఏకాదశి వ్రతం పట్ల భక్తిని దృఢపరుస్తుంది. సూర్యచంద్ర గ్రహణ సమయాల కన్నా ఇది గొప్పది. ఏకాదశి కన్నా నూరు రెట్లు అధిక మహిమ కలిగినది. ఈ ద్వాదశి నాడు చేసిన పుణ్యమైనా, పాపమైనా సరే, అది కోటి రెట్లుగా వృద్ధి చెందుతుంది. ఉదాహరణకు, ఈ తిథినాడు ఒకరికి అన్నం పెడితే, కోటి మందికి అన్నదానం చేసిన పుణ్యం వస్తుంది; అదే విధంగా, ఒక్క మెతుకు అపహరించినా, కోటి మెతుకులు దొంగిలించిన పాపం చుట్టుకుంటుంది.

ఒకవేళ, ఏదైనా రోజున ద్వాదశీ ఘడియలు అతి తక్కువగా ఉన్నా, ఆ స్వల్ప వ్యవధిలోనే పారణను పూర్తిచేయాలి తప్ప, ద్వాదశి తిథి దాటిన తర్వాత చేసే పారణ నిష్ప్రయోజనం. పుణ్యఫలాన్ని ఆశించేవారు మరేదైనా నియమాన్ని మీరినా ఫరవాలేదు కానీ, ద్వాదశీ పారణను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టరాదు. ఏకాదశీ తిథినాడు ఉపవాస దీక్ష వహించి, మరుసటి రోజు ద్వాదశీ తిథి గడవక ముందే పారణ చేసి తీరాలి. దీనివల్ల లభించే మేలును ఆ శేషశాయి అయిన శ్రీహరే వర్ణించాలి కానీ, వేయి పడగల ఆదిశేషువు కూడా వర్ణించలేడు. ఇందుకు అంబరీషుని వృత్తాంతమే తార్కాణం.

అంబరీషోపాఖ్యానము

ద్వాదశీ వ్రతాన్ని నిష్ఠగా ఆచరించేవాడు, భగవత్ భక్తులలో అగ్రేసరుడు అయిన అంబరీషుడు అను మహారాజు, ఒకానొక కార్తీక శుద్ధ ఏకాదశినాడు సంపూర్ణ ఉపవాసం ఉన్నాడు. మరునాడు ద్వాదశి ఘడియలు అతి కొద్ది సమయమే ఉండటంతో, ఆ తిథి దాటకముందే పారణ చేయాలని సంకల్పించాడు. సరిగ్గా అదే సమయానికి దుర్వాస మహర్షి అక్కడికి విచ్చేసి, ఆనాటి ఆతిథ్యంలో తనకూ భోజనం ఏర్పాటు చేయవలసిందిగా అడిగాడు. అంబరీషుడు ఆ మహర్షిని ద్వాదశీ పారణకు సాదరంగా ఆహ్వానించాడు. దుర్వాసుడు వెంటనే స్నాన, జపాది అనుష్ఠానముల కొరకు నదికి వెళ్ళాడు.

అలా వెళ్లిన ఆ ఋషి ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో అంబరీషుడు ఆందోళన చెందాడు. ఆ రోజు ద్వాదశి తిథి సమయం చాలా తక్కువగా ఉంది. సమయం మించిపోకుండా పారణ పూర్తిచేయాల్సిన ఆవశ్యకత ఉంది. మరోవైపు, అతిథి తిరిగి వచ్చేవరకూ వేచియుండుట గృహస్థుని ప్రథమ ధర్మం. దానిని అతడు ఉల్లంఘించలేడు. ద్వాదశి తిథి దాటకుండా పారణ చేయడం ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నవాని ధర్మం. దీనినీ విడిచిపెట్టలేడు. అంతేకాకుండా,

శ్లో || హరిభక్తి పరిత్యాగో ద్వాదశీ త్యాగతో భవేత్

యతో2నుపోషితో భూయా త్కృత్వాసమ్య గుపోషణం

పూర్వం ద్వాదశ సంఖ్యాకే పురుషో హరివాసరే

పాపముల్లంఘనేపాపాత్ నైవయుజ్యం మనీషిణా |

‘ద్వాదశీ వ్రతాన్ని ఎవరైతే ఉల్లంఘిస్తారో, వారు సాక్షాత్తూ విష్ణుభక్తిని విడిచిపెట్టినవారితో సమానం. ఏకాదశి నాడు ఉపవసించకపోతే ఎంతటి పాపం సంభవిస్తుందో, ద్వాదశి నాడు పారణ చేయకపోతే అంతకు రెట్టింపు పాపం ప్రాప్తిస్తుంది. కేవలం ఆ ఒక్క ద్వాదశీ పారణను అతిక్రమించడం వల్ల, ఆనాటి వ్రత ఫలంతో పాటు, అంతకు పూర్వం చేసిన పన్నెండు ద్వాదశీ పారణల ద్వారా సిద్ధించిన మహాపుణ్యం కూడా నశించిపోతుంది. ఎన్నో జన్మల పుణ్యబలం క్షీణించిపోతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా, ద్వాదశిని అతిక్రమిస్తే విష్ణుమూర్తి ఆగ్రహానికి గురికావలసి వస్తుందన్న భయం ఏర్పడుతుంది. అందువల్లనే, ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చినా సరే, ద్వాదశీ పారణను నెరవేర్చడమే ముఖ్య కర్తవ్యం. ఆ కారణంగా బ్రాహ్మణ శాపం వలన కల్పాంతం వరకూ దుఃఖం ప్రాప్తించినా సరే! దుర్వాసుడు తిరిగి వచ్చిన తరువాత కన్నా, ద్వాదశీ తిథి ముగిసిపోవడానికి ముందే పారణ చేసి హరిభక్తిని నిలబెట్టుకుంటే, రాబోయే కష్టాలను ఆ పద్మనాభుడే స్వయంగా తొలగిస్తాడు.’

ఇలా తన మనసులో ఒక స్థిర నిశ్చయానికి వచ్చినప్పటికీ, ధర్మనిరతుడైన ఆ అంబరీషుడు, ద్వాదశీ పారణ కోసం తన చుట్టూ ఉన్న వేద పండితులకు తన ధర్మసందేహాన్ని వివరించాడు.

అంబరీషుని మనోవేదన:

అంబరీషుని ధర్మసందిగ్ధతను విన్న వేదమూర్తులైన ఆ విప్రులు, క్షణకాలం పాటు శ్రుతి, స్మృతి, శాస్త్ర, పురాణాలన్నింటినీ మననం చేసుకుని, “మహారాజా! సర్వలోకాలకు ఈశ్వరుడైన ఆ భగవంతుడే సమస్త ప్రాణుల దేహంలో జఠరాగ్ని రూపంలో కొలువై ఉన్నాడు. ఆ జఠరాగ్ని, ప్రాణవాయువు ద్వారా ప్రజ్వలింపబడటం వలనే జీవులకు ఆకలి అనే భావన కలుగుతోంది. ఆ తాపమే ఆకలిదప్పుల బాధగా చెప్పబడుతోంది. కాబట్టి, తగిన ఆహారం ద్వారా ఆ అగ్నిని తృప్తిపరచి, శాంతింపజేయడమే జీవుల లక్షణం. జీవులు స్వీకరించే భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్య (తినేవి, నమిలేవి, జుర్రేవి, నాకేవి) అనే చతుర్విధ అన్నాదులను వారిలోని ఆ అగ్నిదేవుడే భుజిస్తున్నాడు. జీవులందరిలో ఉన్న ఆ జఠరాగ్ని జగన్నాథుని స్వరూపమే. కనుకనే –

శ్లో || అథ శ్వపాకం శూద్రం వాస్వన్య సద్మాగతం శుభం

అతిక్రమ్య న భుం జీత గృహమే ధృతిథి, నిజమ్ ||

‘తన గృహానికి వచ్చినవాడు శూద్రుడైనా, చండాలుడైనా సరే, ఆ అతిథిని కాదని గృహస్థుడైనవాడు భోజనం చేయకూడదు.’ అటువంటి సామాన్య అతిథి విషయమే అలా ఉంటే, ఇక సాక్షాత్తూ బ్రాహ్మణుడే అతిథిగా వచ్చినప్పుడు, ఆయనను విస్మరించడం ఎంతటి నీచకార్యమో వేరే చెప్పనవసరం లేదు కదా! దానికి తోడు, స్వయంగా ఆహ్వానించబడిన బ్రాహ్మణుని కన్నా ముందే యజమాని భోజనం చేయడం ఆ బ్రాహ్మణుని అవమానించడమే అవుతుంది. రాజా! బ్రాహ్మణులను అవమానించడం వలన ఆయుష్షు, సిరిసంపదలు, కీర్తి ప్రతిష్టలు, ధర్మఫలం అన్నీ నశించిపోతాయి. చివరికి మనసులోని సంకల్పాలు కూడా నెరవేరవు. బ్రాహ్మణుడు సర్వ దేవతల స్వరూపంగా కీర్తించబడ్డాడు కాబట్టి, బ్రాహ్మణునికి జరిగిన అవమానం సకల దేవతలకూ జరిగిన అవమానంతో సమానం.

కేవలం జాతి కారణంగానే బ్రాహ్మణుడు దేవతలతో సమానుడైతే, కేవలం జన్మ వలనే కాక, జ్ఞానం, తపోబలం వలన శుద్ధ రుద్ర స్వరూపంగా పేరుగాంచిన దుర్వాసుని వంటి మహర్షిని భోజనానికి పిలిచి, ఆయన రాకముందే పారణ చేయడం ధర్మమని చెప్పడం అసాధ్యం. కోపిష్టి అయిన ఆ ఋషి శపిస్తాడనే భయాన్ని పక్కన పెట్టినా కూడా –

శ్లో|| వయం న నిశ్చయం క్వాపిగచ్ఛామో నరపుంగవ

తథాపి ప్రథమం విప్రా ద్భోజనం నప్రకీర్తితమ్ ||

‘ఓ నరశ్రేష్ఠుడా! బ్రాహ్మణుడైన అతిథి కన్నా ముందుగా భుజించడం ఎన్నటికీ కీర్తిదాయకం కాదు.’

ఓ రాజా! ద్వాదశీ పారణను విడిచిపెట్టడం వలన, అంతకు ముందు రోజు చేసిన ఏకాదశీ ఉపవాసానికి భంగం వాటిల్లుతుంది. ఆ ఏకాదశీ వ్రత భంగానికి ఎటువంటి ప్రాయశ్చిత్తమూ లేదు. అదే విధంగా, బ్రాహ్మణుడైన అతిథిని అతిక్రమించడం వలన కలిగే విప్ర తిరస్కార పాపానికి కూడా విరుగుడు లేదు. ఇప్పుడు ఈ రెండూ సమానమైన బరువుతోనే ఉన్నాయి.”

చతుర్వింశోధ్యాయ స్సమాప్తః (ఇరవది నాలుగవ అధ్యాయము సమాప్తము)

పంచవింశాధ్యాయము (25వ అధ్యాయము)

విప్రుల ధర్మబోధ

‘అంబరీషా! నీ పూర్వకర్మను అనుసరించి, ఇప్పుడు నీకు రెండు వైపుల నుండీ ఉరితాడు బిగుసుకున్నట్లుగా ఈ ధర్మ సంకటం వచ్చిపడింది. దుర్వాసుడు వచ్చేవరకూ ఆగడమా, లేక ద్వాదశీ ఘడియలు ముగియక ముందే పారణ చేయడమా – ఏది సరైనదో నిశ్చయించి చెప్పడానికి –

శ్లో// స్వ బుద్ధ్యాతు సమాలోక్య కురుత్వం తవ నిశ్చయం ॥

మేము శక్తిహీనులమై ఉన్నాము. కాబట్టి ‘ఆత్మబుద్ధియే సుఖాన్నిస్తుంది’ అనే సూక్తి ప్రకారం, భారం ఆ భగవంతునిపై వేసి, నీ బుద్ధికి ఏది సరైనదని తోస్తే దానిని ఆచరించు’ అని ఆ బ్రాహ్మణులు పలికారు.

ఆ మాటలను విన్న అంబరీషుడు, ‘ఓ బ్రాహ్మణోత్తములారా! బ్రాహ్మణుని శాపం వలన కలిగే కష్టం కన్నా, విష్ణుభక్తిని కోల్పోవడమే నాకు దుర్భరంగా తోస్తున్నది’ అని మనసులో నిశ్చయించుకోగానే, పూజా మందిరంలో ఉన్న యంత్రాన్ని ఆవహించి ఉన్న, జగత్తుకు ఏకైక రక్షకమూ, అదే సమయంలో జగత్తుకు అత్యంత భయంకరమూ అయిన సుదర్శన చక్రం, ఒక్కసారిగా రివ్వున దూర్వాసుని వైపుగా కదిలింది.

అచేతనంగా పూజలందుకునే సంజ్ఞల నుండి, జడరూపమైన ఆ విష్ణుచక్రం, దివ్యమైన కాంతిపుంజాల శోభతో సజీవంగా తన వైపు దూసుకురావడం చూసి దూర్వాసుడు ఉలిక్కిపడ్డాడు. ఆ చక్రానికి చిక్కకూడదని, భూమండలం అంతా క్షణాల మీద తిరిగివచ్చాడు. అయినప్పటికీ, ఆ సుదర్శన చక్రం ఆయనను వెన్నాడుతూనే ఉంది. భయంతో వణికిపోయిన ఆ దూర్వాసుడు, వశిష్ఠుని వంటి బ్రహ్మర్షులను, ఇంద్రుని వంటి అష్టదిక్పాలకులను, చివరికి సాక్షాత్తూ శివ-బ్రహ్మలను కూడా శరణు వేడాడు. కానీ, ఆయన వెనుకనే ప్రళయాగ్ని జ్వాలల వలె వస్తున్న విష్ణుచక్రాన్ని చూసి, ప్రతి ఒక్కరూ తప్పుకున్నారే తప్ప, ఎవరూ ధైర్యం చేసి అభయహస్తం ఇవ్వలేకపోయారు.

పంచవింశోధ్యాయ స్సమాప్తః (ఇరవది ఐదవ అధ్యాయము సమాప్తము)

షడ్వింశాధ్యాయము (26వ అధ్యాయము)

ఈ విధంగా ప్రాణభయంతో, సంభవమైన లోకాలన్నీ సంచరించిన దూర్వాసుడు, చిట్టచివరకు చక్రధారియైన విష్ణుమూర్తి కొలువై ఉన్న వైకుంఠాన్ని చేరుకున్నాడు. ‘ఓ బ్రాహ్మణప్రియా! మాధవా! మధుసూదనా! కోటి సూర్యుల తేజస్సుతో, అంతటి వేడిమితో కూడిన నీ సుదర్శన చక్రం నన్ను సంహరించడానికి వెంబడిస్తోంది. బ్రాహ్మణుల పాదముద్రను వక్షస్థలంపై గొప్పగా ధరించిన వాడవు నీవే నన్ను ఈ ఆపద నుండి రక్షించాలి’ అని ఘోషిస్తూ, ఆ సర్వేశ్వరుడైన శ్రీహరినే శరణు జొచ్చాడు.

శ్రీహరి విలాసంగా చిరునవ్వు నవ్వాడు. ‘దూర్వాసా! నేను ఈ ప్రపంచానికి దైవాన్ని కావచ్చు, కానీ నాకు మాత్రం బ్రాహ్మణులే దైవసమానులు. అయితే, నువ్వు సద్బ్రాహ్మణుడవు, రుద్రుని అంశలో జన్మించినవాడవు అయ్యుండి కూడా, అంబరీషునిపై అకారణంగా ఆగ్రహించి శపించావు. పారణకు వస్తానని చెప్పి, స్నానం కోసం వెళ్లిన నువ్వు, సరైన సమయానికి తిరిగి రాలేదు. ఆలస్యంగా రాదలచుకున్నా, నీకోసం వేచి చూడకుండా, ద్వాదశీ ఘడియలు మించిపోక ముందే పారణ చేయడానికి అనుమతి అయినా ఇవ్వలేదు. ద్వాదశి తిథి ముగిసిపోవడానికి కేవలం కొన్ని క్షణాల సమయం మాత్రమే ఉన్నప్పుడు, అతను వ్రతభంగం అవుతుందనే భయంతో కేవలం మంచినీటిని స్వీకరించాడే తప్ప, ఆకలితోనో లేక నిన్ను అవమానించాలనే దురుద్దేశంతోనో కాదు. ‘అనాహారేపి యచ్ఛస్తం శుద్ధ్యర్థం వర్ణినాం సదా’ – అంటే, నిషిద్ధ ఆహారం తీసుకున్నవారికి కూడా, శుద్ధి కోసం జలపానం చేయడం దోషం కాదని శాస్త్రాలు చెబుతుండగా, అదేమంత పెద్ద నేరమని నువ్వు శపించవలసి వచ్చింది?

ఓ అత్రి పుత్రా! నువ్వు ఎంత కఠినంగా మాట్లాడినా, అతడు నిన్ను వినయంగా శాంతించమని ప్రార్థించాడే కానీ, ఏమాత్రం కోపగించుకోలేదు కదా! అయినప్పటికీ, మోక్షాన్ని కోరే ఆ భక్తుడిని నువ్వు పది దుర్భరమైన జన్మలు ఎత్తమని శపించావు. నా భక్తులను కాపాడుకోవడం కోసం నీ శాపాన్ని నేను ఒక్క నిమిషంలో వెనక్కి తీసుకోగలను. కానీ, బ్రాహ్మణుని మాట వృథా అయిపోయిందనే అపవాదు లోకంలో నీకు కలగకూడదనే సదుద్దేశ్యంతో, ఆ భక్తుని హృదయంలో నేను ప్రవేశించి, నీ శాపాన్ని సవినయంగా స్వీకరించినవాడిని నేనే. నీ శాపాన్ని అంగీకరిస్తూ ‘గృష్ణమి’ (స్వీకరిస్తున్నాను) అని పలికినది కూడా నేనే కానీ, ఆ అంబరీషుడు కాదు. అసలు అతనికి నీవిచ్చిన శాపం గురించిన సంగతే తెలియదు.

ఓ ఋషిప్రవరా! నీ శాపం ప్రకారంగానే, ఈ కల్పాంతంలో దుష్టుడైన శంఖాసురుని వధించేందుకు, నా శిష్యుడైన మనువును రక్షించేందుకు నేను మహామత్స్యంగా అవతరిస్తాను. దేవదానవులు క్షీరసముద్రాన్ని మథించే సమయంలో, మందర పర్వతాన్ని వీపుపై ధరించడానికి ఆధారంగా ఉండేందుకు కూర్మావతారం (తాబేలు) దాలుస్తాను. భూమిని ఉద్ధరించడానికి, హిరణ్యాక్షుని చంపడానికి వరాహ రూపాన్ని ధరిస్తాను. హిరణ్యకశిపుని సంహరించడం కోసం భయంకరమైన ‘నరసింహ’ అవతారాన్ని ఎత్తుతాను. సకల దేవతలను కాపాడటం కోసం, ధర్మబలుడైనా రాక్షసుడైనందున ‘బలి’ చక్రవర్తిని శిక్షించేందుకు వామనుడిగా వస్తాను. త్రేతాయుగంలో జమదగ్ని కుమారుడిగా (పరశురాముడిగా) జన్మించి, సాయుధుడనైన బ్రాహ్మణుడిగా గర్విష్ఠులైన రాజులను శిక్షిస్తాను. రావణుని సంహరించడం కోసం, ‘నేనే భగవంతుడను’ అనే ఆత్మజ్ఞానాన్ని మరచిపోయిన మాయామానుష విగ్రహుడిగా దశరథ రామునిగా అవతరిస్తాను. ద్వాపర యుగంలో, జ్ఞానిని, బలవంతుడను అయ్యుండి కూడా, రాజ్యాధికారం లేకుండా రాజుకు (బలరామునికి) తమ్మునిగా కృష్ణునిగా జన్మిస్తాను. కలియుగ ఆరంభంలో పాపచింతనను వ్యాపింపజేయడం కోసం పాషండ మత ప్రచారకుడనై బుద్ధుడనే పేరుతో పుడతాను. యుగాంతంలో శత్రువులను నాశనం చేసే బ్రాహ్మణునిగా (కల్కిగా) ప్రభవిస్తాను.

దూర్వాసా! నా ఈ దశావతారాలను, ఆయా అవతారాలలోని లీలలను ఎవరు విన్నా, చదివినా, తెలుసుకున్నా వారి పాపాలన్నీ పటాపంచలైపోతాయి.

శ్లో// ధర్మానానా విధా వేదే విస్తృతా వరజన్మనాం

దేశకాల వయోవస్థా వర్ణాశ్రమ విభాగశః ||

దేశము, కాలము, వయస్సు, అవస్థలను బట్టి, మరియు వర్ణాశ్రమ విభాగాలననుసరించి ‘ధర్మము’ అనేది వేదం చేత అనేక విధాలుగా చెప్పబడి ఉంది. అటువంటి వివిధ రకాల ధర్మాలలో కూడా, ‘ఏకాదశి’ నాడు ఉపవాసం ఉండటం, ‘ద్వాదశి’ తిథి దాటకుండా పారణ చేయడం అనేవి విశ్వవ్యాప్తంగా ఆచరించదగినవిగా ప్రకాశిస్తున్నాయి. అటువంటి గొప్ప వైదిక ధర్మాన్ని ఆచరించినందుకు నువ్వు ఆ అంబరీషుని శపించడం చాలక, తిరిగి మరో ఘోరమైన శాపం ఇవ్వబోయావు. బ్రాహ్మణుడవైన నీ వాక్కును సత్యం చేయడం, అదే సమయంలో భక్తుడైన ఆ రాజును కాపాడుకోవడం రెండూ నా బాధ్యతలే. అందుకే, నువ్వు మరలా శపించబోకుండా నిన్ను నివారించడానికే నా చక్రాన్ని పంపించాను.”

(ఇరవది నాలుగు, ఇరవది ఐదు, ఇరవది ఆరు అధ్యాయములు సమాప్తము)

పన్నెండవ (ద్వాదశి) నాటి పారాయణము సమాప్తము.

ఇంకా చదవండి : కార్తీక పురాణం 11వ రోజు కథ

Please share it

Leave a Comment