karthika puranam telugu day 3
కార్తీక పురాణం మూడో రోజు పారాయణలోకి వచ్చాం. అయితే ఇప్పుడు మూడో రోజు ఏం చెప్తున్నారో చూద్దాం.
జనకరాజర్షికి చెప్తున్నారు వశిష్టులు :-
“మనం చేసిన పాపాలన్నిటిని నశింపజేయగలిగే శక్తి ఒక కార్తీక మాస వ్రతానికి మాత్రమే ఉంది.”
కార్తీక మాసంలో విష్ణు సన్నిధిలో ఎవరైతే భగవద్గీత పారాయణం చేస్తారో, వాళ్ల పాపాలన్నీ కూడా పాముకుభుసంలాగా తొలగిపోతాయి. అందుకనే, భగవద్గీతలో 10, 11 అధ్యాయాలు పారాయణం చేసే వాళ్లు వైకుంఠానికి క్షేత్రపాలకులు అవుతారట.
ఎవరైతే కార్తీక మాసంలో తులసి దళాలతో గాని, తెలుపు లేదా ఎరుపు గన్నేరు పూలతో విష్ణు పూజ చేస్తారో, వాళ్లు వైకుంఠానికి చేరి విష్ణు సమభోగాలను అనుభవిస్తారు.
ఎవరైతే కార్తీక పురాణం వింటారో, శివుణ్ని పరమ ప్రీతితో జలాలతో అభిషేకం చేసి పువ్వులు సమర్పిస్తారో, శివాలయంలో దీపారాధన చేస్తారో, వాళ్లు కూడా శివసాయుజ్యాన్ని పొందుతారు.
కార్తీకంలో హరిహరులు ఎవరి సన్నిధినైనా సరే, ఏ పురాణాన్నైనా ప్రవచించేవారు సర్వకర్మ బంధ విముక్తులు అవుతారు.
ఇంకా చెప్తున్నారు :-
కార్తీక మాస శుక్ల పక్షంలో వనభోజనం చేసిన వారు పాప విముక్తులై విష్ణుధామాన్ని పొందుతారు.
శుక్ల పక్షం ప్రాముఖ్యత:-
మనకి ఇది లెక్క ఏంటంటేనండి శుక్ల పక్షం అని ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నారు అంటే, ఇక్కడ మనకి సూర్యుడు తులా రాశిలో ఉండటం అనేది ఒక ప్రత్యేకమైన విషయం అని ముందే చెప్పుకున్నాం.
మనం ఈ తులా రాశిలో సూర్యుడు ఎప్పటిదాకా ఉంటాడు అంటే, ఇంచుమించు ఈ నెల మొదలుపెట్టిన 15 రోజుల దాకా అటు ఇటుగా ఉంటాడు.అంచేత ఆ లోపల శుక్ల పక్షంలోనే గనుక మనం వనభోజనం చేస్తే, సూర్యుడి వల్ల వచ్చే ప్రయోజనాన్ని కూడా పొందగలుగుతామని శుక్ల పక్షం అని చెప్తున్నారు. ఒకవేళ ఇప్పుడు కుదరకపోయినా, కృష్ణ పక్షంలో అయినా సరే, కార్తీకంలో భోజనం చేయడం మనం అవకాశాన్ని బట్టి చేసుకోవాలి.
ఇంకేం చెప్తున్నారు అంటే :-
కార్తీక మాస శుక్ల పక్షంలో వనభోజనాన్ని చేసిన వారు, పాప విముక్తులై విష్ణు ధామాన్ని పొందుతారు.
జప, హోమ, పూజ, భోజన, తర్పణ ఫలాలతోటి, పాపి, క్షుద్రచండాలాది, అసోచవంతుల యొక్క సంభాషణలు వినిన పాపం తుడుచిపెట్టుకుపోతుంది.
కాబట్టి మహారాజా – కార్తీక మాస శుక్ల పక్షంలో అన్ని రకాల వృక్షాలతో పాటు బాగా చక్కగా పండిన ఉసిరి చెట్టు, అంటే ఫలించిన ఉసిరి చెట్టు అయితే మంచిదట.
ఉసిరి చెట్టు మహిమ
చిన్నది చిటి మొక్క ఒక కుండీలో మొక్క పెట్టుకుంటున్నప్పుడు ఏం చేస్తాం అంటే, మనకి వేరే అవకాశం లేక మనం ఆ పని చేస్తున్నాం. కానీ ఫలించిన ఉసిరి చెట్టు ఒక్కసారైనా పూత పూసిన, కాయ కాసిన వృక్షం అయితే మంచిది.
అప్పుడు అది చూడండి -ఎత్తుగా ఉంటుంది. దాని నీడన మనము తాలగ్రామ ఆరాధన చేస్తాం.
ఇంత బుజ్జి తులసి చెట్టు అనుకోండి – మనదే ఆరెంజ్ కలర్ కుండీలో ఉంటుంది, మట్టిరంగు కుండీలో పెట్టుకుంటాం. తులసి దగ్గర, ఉసిరి చెట్టు దగ్గర దీపం పెడతాం. కానీ వనభోజనానికి వెళ్ళేటప్పుడు ఎత్తైన ఉసిరి చెట్టు ఉండాలి. అంత ఎత్తు ఉంటే అది ఒక కాపో పూతోకుండా ఉంటుందా? పూస్తుంది. అలా ఉన్నదాని దగ్గర అయితే విశేషం అట. ఉసిరి చెట్టు కింద సాలగ్రామాన్ని ఉంచి, గంధ, పుష్ప, అక్షతులతో పూజించి, యధాశక్తి బ్రాహ్మణులను ఆహ్వానించి గౌరవించి వారితో కలిసి భోజనం చేయాలి. ఇలా కార్తీక మాసంలో వనభోజనాన్ని ఎవరైతే నిర్వహిస్తారో, వాళ్లు ఆయా కాలాల్లో చేసిన సర్వ పాపాల నుంచి తేలుకొని విష్ణు లోకాన్ని పొందుతారు.
కార్తీక పురాణం మూడవ రోజు కథ
దేవదత్తోపాఖ్యానం ప్రారంభం:-
ఈ కార్తీక మహాత్మ్యాన్ని భక్తి, శ్రద్ధలతో విన్న బ్రాహ్మణుడు ఒకడు ఒక సంకట నుంచి రక్షింపబడ్డాడు.
ఆ కథ చెప్తాను వినమన్నారు – దేవదత్తోపాఖ్యానం చెప్తున్నారు.
పూర్వం కావేరి తీరంలో దేవశర్మ అనే ఒక సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి ఒక పరమ దుర్మార్గుడైన కుమారుడు కలిగాడు -వాడి పేరు దేవదత్తుడు. అతని దుష్ట ప్రవర్తనలను గుర్తించిన తండ్రి, వీడిని పాప విముక్తుని చేయాలని సంకల్పించి,
“నాయనా, రోజూ కార్తీక ప్రాత స్నానాన్ని ఆచరించు. సాయంకాలంలో హరి సన్నిధిలో దీపారాధన చేస్తూ ఉండు. ఈ విధంగా కార్తీక వ్రతాన్ని ఆచరించి ధన్యుడవవు నాయనా,” అని చెప్పాడు.
చెప్పేసరిక, దుర్వర్తనుడైన ఆ బ్రాహ్మణ పుత్రుడు, “నేను ఇలాంటి కట్టు కథలని నమ్మను. ఇలాంటి అర్థం లేని వ్రతాలని ఆచరించను,” అని తండ్రికి ఎదురు తిరిగాడు.
అందుకు కోపగించిన దేవశర్మ, తన కుమారునికి, “నువ్వు ఇంత మూర్ఖంగా ఉన్నావు. నువ్వు భూమి మీద ఉండవలసిన వాడివి కాదు. అడవిలో ఉన్న చెట్టులో ఎలుకబై పడి ఉండమని శపిస్తున్నాను,” అని శపించాడు. శాపానికి భయపడ్డ ఆ విప్రపుత్రుడు, తండ్రి పాదాల మీద పడి, “నాకు తరుణోపాయం చెప్పు, తండ్రి!” అని బతిమిలాడాడు.
అప్పుడు దేవశర్మ అన్నాడు –
“ఎప్పుడైతే నువ్వు కార్తీక మహాత్మ్యాన్ని సంపూర్ణంగా వింటావో, అప్పుడే నీ ఎలకరూపం పోతుంది రా నాయనా,” అని శాప విముక్తిని అనుగ్రహించాడు.
పితృశాప కారణంగా అప్పటికప్పుడే మూషిక రూపాన్ని ధరించిన బ్రాహ్మణ యువకుడు, గజారణ్యంలో ఫలవంతమైనది, అనేక జంతువులకు ఆధారభూతమై ఉన్నటువంటి ఒక మహావృక్ష కోటరంలో ఉండటం మొదలు పెట్టాడు.
ఇలా కొంతకాలం గడిచాక, ఒకానొకప్పుడు మహర్షి అయిన విశ్వామిత్రుడు, శిష్య సమేతంగా కార్తీక స్నానం ఆచరించి వచ్చి, ఆ ఎలుక ఉన్న చెట్టు మొదలునందు హాయిగా కూర్చుని తన పరివారానికి పరమ పావనమైన కార్తీక మహాత్మ్యాన్ని చెప్తున్నాడు.
అదే సమయంలో, దయాహీనుడు, పాపాల పుట్ట, అడవి జీవాలను హింసించి పొట్ట పోసుకునేవాడు అయిన ఒక కిరాతకుడు ఆ ప్రాంతాలకు వచ్చాడు.
పుణ్యపురుషుల దర్శనం వల్ల ఉపకారమే గానీ అపకారం ఎప్పటికీ జరగదు. అదేవిధంగా, విశ్వామిత్రాది తపోబృందమాత్రం చేత రవంత పశ్చాత్తప్తుడు, జ్ఞాని అయినటువంటి ఆ కిరాతకుడు వారిని సమీపించి,
“అయ్యా, మీరు చెప్పుకుంటున్న కథలు ఏమిటి? అవి వింటుంటే నాకు ఈ కిరాత జీవితం పట్ల చిరాకు పుడుతోంది. దయచేసి ఆ రహస్యం ఏమిటో చెప్పండి,” అని అడిగాడు.
విశ్వామిత్రుని ఉపదేశం
అతనిలో వివేకం విచ్చుకున్న వయనాన్ని గ్రహించిన విశ్వామిత్రుడు అన్నాడు – “నాయనా, మేము కార్తీక వ్రతాన్ని ఆచరిస్తున్నాం. ఈ కార్తీక మాసంలో ఎవరైనా తెలిసి గాని తెలియక గాని, స్థాన, దాన, జపతప, పురాణ శ్రవణాదులు చేసినట్లయితే వారు సర్వపాపాల నుంచే విముక్తులు అవుతారు.ఈ వ్రతాన్ని భక్తితో ఆచరించే వాళ్లు జీవన్ముక్తులు అవుతారు.”
ఈ విధంగా కిరాతునికి చెప్తున్న కార్తీక మహాత్మ్యాన్ని వినటమే తడవగా, త్వరలో ఉన్న ఎలుక రూపంలో ఉన్న దేవదత్తుడు శాపగ్రస్త రూపాన్ని వదిలేసి, పూర్వ యువ బ్రాహ్మణ రూపాన్ని పొంది, విశ్వామిత్రాదులకు నమస్కరించి, తమ పూర్వగాధను వినిపించి, ఆ ఋషుల నుండి సెలవు తీసుకొని తన ఇంటికి వెళ్ళిపోయాడు.
అనంతరం ఆ కిరాతుడు కూడా విశ్వామిత్రాదుల వల్ల ఈ కార్తీక మహాత్మ్యాన్ని కడకంతా తెలుసుకోవడం వల్ల, ఆ జన్మకి కిరాతుడు అయినప్పటికీ కూడా దేహాంతరాన ఉత్తమగతులు పొందాడు.
కాబట్టి ఉత్తమగతులు కోరేవాళ్లు ప్రయత్నపూర్వకంగా అయినా సరే కార్తీక వ్రతాన్ని ఆచరించాలి లేదా కనీసం కార్తీక వ్రత మహాత్మ్యాన్ని చెవితోటైనా వినాలి.
పూజా విధానాలు -వశిష్ఠుల ఉపదేశం
ఇప్పుడు పూజా విధానాల గురించి చెప్తున్నారు అండి శ్రీ వశిష్టులు :-
“ఓ జనకరాజర్షి! ఈ కార్తీక మాసం 30 రోజులు కూడా ఎవరైతే మహావిష్ణువును కస్తూరి గంధాదులతోను, పంచామృతాలతోను అభిషేకిస్తారో, వారికి పదివేల అశ్వమేధాలు చేసిన ఫలితం లభిస్తుంది.
కార్తీక మాసంలో సంధ్యావేళల విష్ణు సన్నిధిలో దీపారాధన చేసినా, దీపదానం చేసినా వారికి విష్ణులోకం లభిస్తుంది.”
దీపదాన విధానం:-
పత్తిని శుభ్రపరిచి దాంతో వత్తి చేసేసి, బియ్యపిండి లేదా గోధుమపిండితో ప్రమిదం చేసి, ఆవు నెయ్యిని పోసి ఆ పత్తిని తడిపి వెలిగించి, ఒక సద్బ్రాహ్మణుడిని ఆహ్వానించి, చివరి రోజున వెండి ప్రమిదను తయారు చేయించి, దానికి బియ్యపిండిమధ్య ఉంచి పూజా నివేదనాదులను పూర్తి చేసి, బ్రాహ్మణులకు భోజనం పెట్టి, తాము స్వయంగా ఈ దీపం “దాస్యామి తే దేవా” అని మంత్రంతో బ్రాహ్మణుడికి దానం చేస్తే, ఎన్నో కష్టాలు తొలగిపోతాయట.ఆయుర్వృద్ధి, విద్య, జ్ఞానవృద్ధి, అనంతరం స్వర్గభోగాలు కలుగుతాయి. అక్షయమైన పుణ్యం లభిస్తుంది.
దీపదానం ఫలితం:-
ఈ దీపదానం గురించి చెప్తారండి –
30 రోజులు బియ్యపిండితో చేసిన దీపాన్ని దానం చేసి, చివరగా 30వ రోజున అమావాస్య లేదా చతుర్దశి నాడు, చిన్న వెండి ప్రమిదలో బంగారపు సన్న తీగతో వత్తులు చేసి, ఆ వత్తులను ఈ బియ్యపిండి దీపం మీదే పెట్టాలి. దాన్ని దానం చేస్తే ఫలితం లభిస్తుంది అంటారు.
ఇప్పుడు మనం చాలామంది ఎలా చేస్తున్నారు అంటే – ఈ నెల రోజుల దీపారాధన మామూలుగా చేసుకొని, ఇవి లేవు దానాలు లేవు. చివరిదైన నాడు లేదా మధ్యలో ఏదో ఒకరోజు మనకి కుదిరినప్పుడు ఒక వెండి ప్రమిదని, బంగారు వత్తి వేసి దానం చేయటం ఒక విధానంగా కనిపిస్తుంది.
దీపదానం సందర్భాలు:-
ఇప్పుడే కాదు అండి -మనం మామూలుగా కూడా చూడండి, గృహప్రవేశం చేసుకుంటాం, సత్యనారాయణ వ్రతం చేసుకుంటాం, పిల్లలకి ఆయుర్వృద్ధి కోసం ఆయుష్యహోమాలు చేస్తాం. 60 ఏళ్లకు ఉగ్రరథ శాంతి చేసుకుంటాం, 70 ఏళ్లకు షష్టి పూర్తి వంటి శాంతులు జరుపుకుంటాం కదా! అలాంటివి యజ్ఞ సందర్భాల్లో, నవగ్రహారాధనల్లో, మంటపారాధనల్లో కూడా దీపదానం సాంగంగా చక్కగా చేసుకోవచ్చు. అది కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. కార్తీకంలో చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుంది.ఇప్పుడు కేదారేశ్వర వ్రతం చేస్తాం కదా, అప్పుడు మనం ఆ వచ్చిన పురోహితుడికి చక్కగా దీపదానం చేసుకోవచ్చు. దానిని ఒట్టిగా వెండి వస్తువునే ఇవ్వటం విధి కాదండి. దానికి కచ్చితంగా బియ్యపిండితో ఒక ప్రమిదం చేసి, దాంట్లోనే ఈ వెండి ప్రమిదను పెట్టాలి. పెట్టి ఇవ్వాలట.
పూర్వము ద్రావిడ దేశంలో ఒక అనాధ వితంతువు ఉండేదట.
ఆమె ప్రతి రోజు భిక్షాటనం చేసివచ్చి వచ్చిన దాంట్లో మంచన్నం, కూరలు అమ్మేసి, దూషితమైన కొద్దిపాటి మిగిలినవి – పొద్దుటి చప్పటివి, సద్దివి మాత్రం తినేదట.
చాలా డబ్బులు వెనకేసేది. ఇతరుల ఇళ్లలో వంట పనులు, కుట్టు పనులు, కొట్టుళ్లు, దంచుళ్లు చేసేది.
వడ్ల పనులు చేయడం, పొలం పనులు చేయడం వంటి పనులు చేసి, ప్రతిఫలంగా తక్కువ డబ్బు తీసుకొని, వాటిని దాచిపెట్టేది. అంతేకాకుండా, “బాబు, రూపాయి ఇవ్వండి, పావల ఇవ్వండి” అని ధనార్జన కోసం భిక్షాటనం కూడా చేసేది.ఇట్లా నిత్యము ధనార్జనమే ఆమె ధ్యేయమైపోయింది. ఆమె లగ్నమానస ధనార్జన లగ్నమానసంగానే ఉందట. ఏనాడు హరినామ స్మరణ చేయలేదు. ఒక హరికథ వినలేదు. పురాణం లేదు, పుణ్యతీర్థ సేవన లేదు, ఏకాదశి ఉపవాసం లేదు. ఇలాంటి దురదృష్టవంతురాలికి ఏమనాలి? ఇంకా, లుబ్దురాలు అంటారు -పిసినిగొట్టు!
శ్రీరంగ యాత్రికుడి దర్శనం:-
ఈ పిసినిగొట్టు స్త్రీ ఇంటికి దైవయోగవశాత్తూ శ్రీరంగ యాత్రికుడైన ఒక బ్రాహ్మణుడు వచ్చాడు.
ఆమె వాకిట్లో పడుకున్నాడు. ఆమె స్థితి చూసి జాలిపడి అన్నాడు-
“ఓ అమ్మాయి! నువ్వు ఎంతో అమాయకురాలివి. నేను చెప్పేది శ్రద్ధగా ఆలకించు. ఈ తోలు శరీరం ఒట్టి అశాశ్వతం అని తెలుసుకో.
నీ శరీరం నేల, నీరు, నిప్పు, నింగి, గాలి -ఈ పంచభూతాలతో నిర్మితమైనది.
నువ్వు రేపు పొద్దున మరణిస్తే ఇవన్నీ వాటి మూలభూతాల్లో కలిసిపోతాయి. ఇంటి కప్పు మీద వానపడితే అది ఎట్లా చెదిరి పోతుందో, అలాగే ఈ శరీరం కూడా చెదిరిపోతుంది. ఈ శరీరం శాశ్వతం కాదు. నువ్వు దాచేది, పోషించేది ఏదీ నీతో రాదు. పట్టుకుపోయేది లేదు అమ్మా! ఇవి నమ్మకు. ఏదైనా చేసుకోవాలి అంటే – దైవస్మరణ చేయి. దైవం ఒకడే శాశ్వతుడు. సర్వభూత దయాకారుడు. ఆయనను గుర్తించు. నిత్యము హరిచరణాలను స్మరించు. ఈ కోరికలు, దురాగ్రహం, భయం ఇవన్నీ చేయొద్దు. ఇవన్నీ అనవసరమైనవి. ఈ డబ్బు కోసం నువ్వు శ్రమిస్తున్నావు కానీ అందులో ఒక్క పావల నీకే ఉపయోగపడదు. నువ్వు చనిపోయాక దానికి కూడా ప్రయోజనం ఉండదు. కనీసం ఆ డబ్బుతో ఏదైనా దానం చేయి. ఏదైనా పూజ చేయి. ఏదైనా దేవాలయ దర్శనం చేయి. తీర్థయాత్ర చేయి. ఈ డబ్బుతో ప్రాయశ్చిత్తం ఆచరించు. రోజూ చేయకపోయినా, కనీసం కార్తీకంలో చేయమ్మా. విష్ణు ప్రీతికి, భగవద్భక్తికి దీపదానం చేయి. అనేక పాపాల నుంచి నువ్వు విముక్తురాలవుతావు.”
ఆ బ్రాహ్మణుడు ఇంకా అన్నాడు –
“అన్నం అమ్మితే పరమపాపం.
అన్నం అమ్మితే పాపం అంటారు – ఇప్పుడు అన్నీ హోటల్సే కదండీ!
మనం అన్నీ కొనుక్కుంటున్నాం కాబట్టి, తప్పదు కానీ దైవారాధన తప్పక చేయాలి.” ఆహారం అమ్మేవాళ్లు – అంటే హోటల్స్, రెస్టారెంట్లు, కూరలు, తిండిపదార్థాలు అమ్మేవారు – వాళ్లు తప్పకుండా కార్తీక వ్రతాన్ని ఆచరించాలట. మంచి మాటే కదండీ! మన అవసరాల కోసం వ్యాపారం చేసుకుంటాం. అది పాపం కాదు. కానీ ఆ పాపాన్ని పోగొట్టుకోవడానికి కార్తీక వ్రతాచరణ చేస్తే సరిపోతుంది. పురాణం విన్నా చాలు కదా! అనేక పాపాల నుంచి రక్షించబడతారని హితవు చెప్పి, ఆ బ్రాహ్మణుడు తన దారిన శ్రీరంగం వెళ్ళిపోయాడు.
వితంతువు జ్ఞానోదయం:-
ఆయన చెప్పిన వచన మహిమ వల్ల, ఆ వితంతువుకు జ్ఞానోదయం కలిగింది.
తన చేసిన పొరపాట్లకు చింతించింది.
“నేను కూడా కార్తీక వ్రతం చేద్దాం” అని సంకల్పించింది.
ఆ సంవత్సరంలో వచ్చిన కార్తీక మాసంలో వ్రతాచరణ ప్రారంభించింది.
సూర్యోదయ వేళ చల్లని నీటితో స్నానం, హరిపూజ, దీపదానం, తరువాత పురాణశ్రవణం –
ఈ విధంగా నెల రోజుల కార్తీక మాసం ఆచరించింది. చివరి రోజున చక్కగా బ్రాహ్మణ సమారాధన కూడా చేసింది. తక్షణమే ఆమె బంధాలు నశించిపోయి, మరణానంతరం విమానయానంతో శాశ్వత స్వర్గసౌఖ్యాన్ని పొందింది.
కాబట్టి ఓ రాజా!
కార్తీక మాసంలో అన్నిటికంటే ప్రధానమైనది – దీపదానం.
తెలిసి గాని తెలియక గాని ఎవరైతే దీపదానం చేస్తారో, వారు తమ పాపాలను శింపజేసుకుంటారు.దీన్ని వినినా, చదివినా – జన్మ సంసార బంధముక్తులై, విష్ణుభక్తి పారాయణులు అవుతారు. ఈ విధంగా మూడో రోజు పారాయణం పూర్తయింది.శుభం.
ఇంకా చదవండి : కార్తీక పురాణం రెండవ రోజు కథ





