karthika puranam telugu day 5
సంపూర్ణ కార్తీక మహాపురాణము – అయిదవరోజు పారాయణము
నవమాధ్యాయము
యమదూతల ప్రశ్నలను విని, చిరునవ్వుతో విష్ణుదూతులు ఇలా అన్నారు –
“ఓ యమదూతులారా! మేము శ్రీమహావిష్ణువు దూతులము. మీ ప్రభువు యముడు మీకు బోధించిన ధర్మాలు ఏమిటి? పాపాత్ముడు ఎవరు? పుణ్యాత్ముడు ఎవరు? యమదండనకు అర్హులు ఎవరు? వీటన్నింటిని విపులంగా చెప్పండి.”
విష్ణుదూతల ప్రశ్నలకు యమదూతులు గౌరవంతో సమాధానమిచ్చారు –
“సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వాయువు, ఆకాశం, గోవులు, సంధ్యా కాలం, దశదిశలు – వీరందరూ మానవుల పాపపుణ్యాలకు సాక్షులు. వారిని ఆధారంగా చేసుకొని మేము పాపులను శిక్షిస్తాము.
ఓ విష్ణుదేవతలారా! శ్రద్ధగా వినండి. వేదమార్గాన్ని విడిచి స్వేచ్ఛాచారులుగా, సజ్జనసంఘం నుండి దూరమై జీవించే వారు యమదండనకు అర్హులు.
బ్రాహ్మణుడు, గురువు, రోగి వంటి వారిని అవమానించే వారు, తల్లిదండ్రులతో కలహించే వారు, అబద్దాలు చెప్పేవారు , జంతువులను హింసించే వారు, దానం చేసి తిరిగి దానినే ఆశించే వారు, గర్విష్ఠులు, దయలేని వారు – వీరందరూ యమలోక శిక్షకు పాత్రులు.
పరస్త్రీతో సంబంధం కలిగినవాడు, లంచం తీసుకొని అన్యాయంగా పక్షపాతం చూపువారు, స్నేహితుడిని ద్రోహం చేసే వాడు, కృతఘ్నుడు, ఇతరుల సంతతిని చూసి ద్వేషించే వాడు, కన్యాశుల్కంతో జీవించే వాడు, నీటిమందిరాలు లేదా వాపీకూపాలను నిర్మించడంలో అడ్డంకి కలిగించే వాడు, తల్లిదండ్రుల శ్రాద్ధకర్మలను విస్మరించే వాడు, భోజనాసక్తితోనే జీవించే వాడు, ఇతరులు చేసే దానాలను అడ్డుకునే వాడు, నిత్యస్నానసంధ్యాదులను విడిచిపెట్టిన వాడు, బ్రాహ్మణ, అశ్వ, గోహత్యాది పాపాలు చేసినవారు – వీరందరూ మా చేత యమలోకంలో దండించబడతారు.
ఇక ఈ అజామిళుడి సంగతి ఏమిటి? ఇతడు చేయని పాపమంటూ లేదు. బ్రాహ్మణుడిగా పుట్టి, దాసీసంగమంలో మునిగి అనేక పాపాలు చేసిన ఇతడు, మీ విష్ణులోకానికి ఎలా అర్హుడయ్యాడు?”
యమదూతల సమాధానాన్ని విని, విష్ణుపార్షదులు సాంత్వనతో ఇలా చెప్పారు –
**“ఓ యమదూతులారా! ఉత్తమ లోకాలను పొందటానికి అవసరమైన పుణ్యమార్గం గురించి వినండి. ఎవరైతే దుస్సంగతిని విడిచి సత్సంగతిని పొందుతారో, నిత్యం దైవచింతనలో ఉంటారో, స్నానం, సంధ్య, జప, హోమాలలో నిబద్ధత చూపుతారో -వారిని మీ యమలోకానికి తీసుకుపోవడానికి మీరు అర్హులు కాదు.
అసూయరహితులు, జపాగ్నిహోత్ర నిర్వాహకులు, తమ సర్వకర్మలను సగుణబ్రహ్మార్పణంగా సమర్పించే వారు, జలదానం, అన్నదానం, గోప్రతిపాలన వంటి పుణ్యకార్యాలు చేసే వారు – వీరిని యమలోకానికి తీసుకుపోవడం సముచితం కాదు.
విద్యాదాతలు, పరోపకారశీలులు, హరిపూజలో ఆసక్తి కలిగిన వారు, హరినామ జపకులు, వివాహ-ఉపనయనాది శుభకార్యాలు నిర్వహించే వారు, అనాథలకు ప్రేతకర్మలు చేసే వారు – వీరందరూ యమదండనకు అనర్హులు.
సాలగ్రామశిలను నిత్యం పూజించే వారు, పవిత్రతీర్థజలాన్ని సేవించే వారు, తులసీకాండలతో భక్తినిరతులుగా ఉండే వారు, తమ ఇంటి ప్రాంగణంలో తులసిని నాటే వారు, భాగవతాన్ని పఠించే వారు, వినే వారు – వీరెవరూ కూడా మీ యమలోకానికి రావడం లేదు.
సూర్యుడు మేష, తులా, మకర సంక్రాంతులలో ఉన్నప్పుడు ప్రాతఃస్నానం ఆచరించే వారు, తెలిసిగానీ తెలియకగానీ హరినామస్మరణ చేసే వారు – పాపవిముక్తులవుతారు.
ఓ యమదూతులారా! ఇంకేమీ మాటలెందుకు? ఎవడు అవసానకాలంలో ఒక్కసారైనా హరినామాన్ని స్మరించాడో, అతడు విష్ణులోకాన్ని చేరుతాడు.”
అలా యమదూతలతో విష్ణుదూతుల మధ్య సంభాషణ సాగుతుండగా, అజామిళుడు తన గత పాపాలను తలచుకొని లోలోన చింతలో మునిగిపోయాడు. తన దుష్కార్యాలను గుర్తుచేసుకుంటూ ఆవేదనతో నిట్టూర్చాడు.
తన మనసులో తానే ఆశ్చర్యపడి అనుకున్నాడు – “ఇదెంత అద్భుతం! ఆ కృష్ణవర్ణ యమదూతులు ఎక్కడికి పోయారు? నేను ఈ వైకుంఠసమీపంలో ఎలా చేరాను? పూర్వజన్మపుణ్యం లేకుండా నా నాలుకపై హరినామం ఎలా వచ్చిందో? నేను ఇంతటి వైకుంఠప్రాప్తి ఎలా పొందాను?” ఇలా తనలో తానే ఆలోచిస్తూ హరిస్మరణలో మునిగిపోయాడు.
వశిష్ఠుడు రాజు జనకుని ఉద్దేశించి ఇలా అన్నాడు –
“రాజా! కేవలం హరినామస్మరణ మాత్రమే ముక్తిని ప్రసాదించగలదు. అటువంటి హరినామానికి ప్రియమైన కార్తీకవ్రతాన్ని ఆచరిస్తే కలిగే పుణ్యం ఎంత అపారమో ఆలోచించు.” నవమాధ్యాస్సమాప్తః
జనకుడు ప్రశ్నించాడు ?
“ఓ వశిష్ఠ మహర్షీ! ఈ అజామిళుడు గత జన్మలో ఎవరు? ఏ పాపఫలంతో ఇలాంటి జన్మను పొందాడు? విష్ణుదూతల మాటలు విని యమదూతలు ఎందుకు మౌనమయ్యారు? వారు యముని సమక్షంలో ఏమని విన్నవించారు? దయచేసి అన్ని విషయాలను సమగ్రంగా వివరించు.”
వశిష్ఠుడు అన్నాడు
“మహారాజా! నీ ప్రశ్నలన్నింటికీ క్రమానుసారంగా సమాధానం చెబుతాను, శ్రద్ధగా విను.
విష్ణుపారిషదులచే నిరాకరింపబడిన యమదూతలు తమ అధిపతి అయిన యముని వద్దకు వెళ్లి ఇలా నివేదించారు.”
యమదూతల ఫిర్యాదు – యముని ఉపదేశం
“ప్రభూ! అజామిళుడు అనే పాపాత్ముడు, దుర్మార్గుడు, నిందార్హకర్మాచరణలో నిమగ్నుడైన వాడు. అతని ప్రాణాన్ని లాగుటకు మేము వెళ్లగా, విష్ణుదూతలు మమ్మల్ని ఆపి, అతన్ని మాకుండి విడిపించి వైకుంఠానికి తీసుకెళ్లారు. వారిని ఎదిరించలేక మేము నిరాశ్రయులమై వచ్చాము,” అని వారు చెప్పారు.
వారి వాక్యాలను విని, క్షణకాలం యముడు ఆగ్రహంతో రగిలినా, వెంటనే తన జ్ఞానదృష్టితో సమస్తాన్ని అవలోకించి శాంతంగా అన్నాడు
“కింకరులారా! ఆ అజామిళుడు ఎంత పాపి అయినా, అంత్యకాలంలో శ్రీహరి నామస్మరణ చేసినందున అతని పాపమంతా క్షయమై, విష్ణుని ప్రియుడయ్యాడు. అందుకే విష్ణుదూతలు అతన్ని తీసుకెళ్లారు.
అగ్ని ఎలా తాకినదంతా దహింపజేస్తుందో, అలాగే హరినామస్మరణ చేసే వాడి పాపమంతా నశిస్తుంది – తెలిసి చేసినా, తెలియక చేసినా.భక్తి భావంతో స్మరించిన వారు మాత్రం కైవల్యపథం వైపు ప్రస్థానిస్తారు,” అని యముడు చెప్పి, ఆలోచనలో మునిగిపోయాడు.
అజామిళుని పూర్వజన్మ కథ:-
అజామిళుడు గతజన్మలో సౌరాష్ట్ర దేశంలో ఒక శివార్చక బ్రాహ్మణుడు. కానీ ఆ జన్మలో కూడా అతడు స్నాన, సంధ్యా మొదలైన ఆచారాలు చేయని వాడు. దేవుని పట్ల భక్తి లేకుండా, దేవద్రవ్యాలను దుర్వినియోగం చేసే అలవాటు కలిగినవాడు. బ్రాహ్మణుడైనప్పటికీ దుష్టులతో స్నేహం చేస్తూ తిరిగేవాడు. అర్చకుడై ఉండీ విలాసజీవనంలో మునిగిపోయి, అలంకార ప్రియుడై స్వేచ్ఛగా విహరించేవాడు. యువకుడైన అతడు పాండిత్యంతో ప్రసిద్ధి పొందాడు.
అతడు నివసించిన గ్రామంలో ఒక దరిద్ర బ్రాహ్మణుడు ఉండేవాడు. పేదరికంతో బాధపడుతూ, ఆహారార్థం ఊరూరా తిరుగుతూ యాయవార వృత్తి చేపట్టేవాడు. ఒకసారి భిక్షాటనతో సంపాదించిన అన్నింటిని ఇంటికి తెచ్చి భార్యను పిలిచి,
“అమ్మా, చాలా ఆకలిగా ఉంది. వెంటనే వంట చేయు. ముందుగా కొద్దిగా నీరు తేవు, దానితో ఉపశమనం పొందుతాను,” అన్నాడు. కానీ యౌవన మదంతో మునిగిపోయిన ఆ ఇల్లాలు భర్త మాటలను పట్టించుకోకుండా తన జారుని గురించే ఆలోచిస్తూ ఉండిపోయింది. కోపంతో భర్త ఆమెను కర్రతో కొట్టాడు. ఆగ్రహంతో ఆమె కూడా భర్తను ముష్టితో బలంగా కొట్టింది. దుఖితుడైన ఆ బ్రాహ్మణుడు ఆమెను, ఇల్లును వదిలి గ్రామం విడిచి, భిక్షాటనతో జీవనాన్ని కొనసాగించాడు. భర్త వెళ్ళిపోవడంతో ఆ స్త్రీ మరింత దుర్మార్గురాలై, భర్త తెచ్చిన ఆభరణాలను ధరించి, మంచి వస్త్రాలను కట్టుకుని, తాంబూలం నములుతూ ఒక రజకుడి ఇంటికి వెళ్లి అతనిని అనుచిత సంబంధానికి ఆహ్వానించింది. కానీ నీతిమంతుడైన రజకుడు ఆమె కోరికను తిరస్కరించాడు. దీంతో వాగ్వివాదం జరిగి, విఫలమైన ఆ స్త్రీ వీధుల్లో తిరుగుతూ రసికులను వెతుక్కుంటూ వచ్చింది. అప్పుడు ఆ శివార్చక బ్రాహ్మణుడిని చూసి అతనిని కూడా ఇంద్రియవాంఛతో ఆకర్షించింది. అతడు కూడా ఆమె పరస్త్రీ అనే జ్ఞానం మరచి, ఆ రాత్రంతా ఆమెతో సుఖించాడు.
అయితే ఆ స్త్రీ సద్గోత్రంలో పుట్టినదై ఉండడం వల్ల, కామం తీరిన తర్వాత పాపాన్ని గ్రహించి భర్తను వెతికివెళ్లి క్షమాపణలు అడిగి, తరువాత పాపాచారాలన్నీ విడిచి నీతిమార్గంలో జీవించింది.
ఈ పాపకార్యాల ఫలితంగా ఆ శివార్చకుడు మరణానంతరం రౌరవాది నరకాల్లో అనేక యాతనలను అనుభవించి, చివరికి సత్యనిష్ఠుడి కొడుకుగా అజామిళుడిగా జన్మించాడు. కార్తీక పౌర్ణమి రోజున శివదర్శనం చేయడం, అంత్యకాలంలో హరినామ స్మరణ చేయడం వలన అతనికి మోక్షం లభించింది.
ఆ శివార్చకునితో జారత్వం చేసిన ఆ బ్రాహ్మణ స్త్రీ మరణించి, నరకయాతనలను అనుభవించి, కన్యాకుబ్జంలో ఒక ఛండాలుడి ఇంట పుట్టింది. కాని తండ్రి శాపగ్రస్తుడై ఉండటంతో, ఆ శిశువును అడవిలో వదిలేశారు. ఆ రోదన విని, ఒక బ్రాహ్మణుడు ఆమెను రక్షించి తన ఇంటి దాసీకి పెంచమని ఇచ్చాడు. ఆ దాసీ వద్ద పెరిగిన ఆ బాలికనే తరువాత కాలంలో అజామిళుడు తన దగ్గరికి తీసుకున్నాడు.
మహారాజా! నీవడిగిన అజామిళుని పూర్వగాథ ఇదే. అన్ని పాపాలకు హరినామస్మరణ కన్నా గొప్ప ప్రాయశ్చిత్తం మరొకటి లేదు. అది సాధ్యం కానప్పుడు మాత్రమే ధర్మశాస్త్రాలలో చెప్పబడిన ఇతర ప్రాయశ్చిత్త కర్మలను చేయాలి.
వశిష్ఠుని తుదు ఉపదేశం:-
“జనక నరపాలా! ఎవరి జిహ్వ హరినామాన్ని ఉచ్చరించదో, ఎవరి మనసు హరి చరణాలను ధ్యానించదో, ఎవరి చెవులు శ్రీహరి సంకీర్తన వినవో, వారి పాపాలు ఎట్టి పరిస్థితిలోనూ నశించవు. ఎవరు ఇతర చింతలను విడిచిపెట్టి విష్ణువునే స్మరిస్తారో వారు తప్పకుండా కైవల్యం పొందుతారు.
మోక్షాసక్తులకు మురహరి స్మరణ ఒక సూక్ష్మమార్గమైతే, కార్తీక ధర్మాచరణ కూడా అంతే శ్రేష్ఠమైన పుణ్యప్రదాయిని. ఇది పాతకాలను పారదోలగల శక్తి కలది. ఎవరు ఈ పవిత్ర కార్తీక వ్రతాన్ని ఆచరిస్తారో వారు నరకప్రాప్తి నుంచి తప్పించబడతారు. ఈ మహాత్మ్యాన్ని భక్తితో వినేవారికీ మోక్షం లభిస్తుంది. పావనహృదయంతో ఈ మహాత్మ్యాన్ని ఇతరులకు వినిపించేవారు వైకుంఠగాములు అయి శ్రీహరితో సుఖిస్తారు.”
ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యంలో
నవమ, దశమ అధ్యాయములు సమాప్తమయ్యాయి – అయిదవ రోజు పారాయణము సమాప్తము.
Also read : కార్తీక పురాణం నాలుగవ రోజు కథ





