Nagula chavithi in telugu
నాగుల చవితి విశిష్టత
అక్టోబర్ 25వ తేదీ శనివారం నాగుల చవితి సందర్భంగా ఏ విధమైన ఆచారాలు పాటిస్తే కాలసర్ప దోషం, రాహు,కేతు దోషం, లేదా దేవతా సర్పాల శాపం వంటి అన్ని కష్టాలనుండి సులభంగా విముక్తి పొందవచ్చో తెలుసుకుందాం. అలాగే నాగుల చవితి పూజ వెనుక ఉన్న ఆధ్యాత్మిక, పౌరాణిక, వేదాంత, వైజ్ఞానిక రహస్యాలను కూడా ఈ సందర్భంలో పరిశీలిద్దాం.
కార్తీక మాసంలోని శుక్ల పక్ష చవితి తిథినే నాగుల చవితిగా పిలుస్తారు. ఈ పర్వదినం సాధారణంగా శ్రావణం లేదా కార్తీక మాసంలో వస్తుంది. ఈసారి అక్టోబర్ 25వ తేదీ శనివారం కార్తీక మాసంలో నాగుల చవితి జరగనుంది.
పుట్ట పూజా విధానం:-
ఈ రోజున సమీపంలోని దేవాలయానికి వెళ్లి అక్కడ ఉన్న పుట్ట దగ్గర పూజ చేయాలి. ముందుగా పసుపును నీటిలో కలిపి ఆ పసుపు నీటిని పుట్టపై చల్లాలి. తరువాత బియ్యప్పిండి, పసుపు, కుంకుమ పుట్ట మీద చల్లాలి.
తరువాత పుట్ట చుట్టూ శుభ్రముగా ముగ్గు వేయాలి. పుట్ట పక్కన దీపం వెలిగించి పుష్పాలతో అలంకరించాలి. ఆపై పుట్టలో ఆవుపాలు పోయాలి. పుట్ట పక్కన చలిమిడి లేదా చిమ్మిలు నైవేద్యంగా సమర్పించాలి. అనంతరం పుట్ట కళ్ళు వేసి, పుట్టపై ఉన్న మట్టిని కొద్దిగా తీసుకొని కుంకుమతో కలిపి బొట్టుగా పెట్టుకుని ఇంటికి రావాలి.
ఇవి పూర్తిగా చేయలేని వారు కనీసం పసుపు, కుంకుమ జల్లి, పాలు పోసి, చలిమిడి లేదా చిమ్మిలు పెట్టి, పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేస్తే కూడా అద్భుత ఫలితాలు లభిస్తాయి.
పుట్ట పూజ లేదా ప్రదక్షిణ సమయంలో ఈ శ్లోకాన్ని చదవండి-
“కర్కోటకస్య నాగస్య దమయంత్య నలస్య చ, ఋతుపర్ణస్య రాజర్షే కీర్తనం కలినాశనం.”
ఈ శ్లోకం పఠించడం వల్ల కలియుగంలో కలిగే బాధలు, కష్టాలు తొలగిపోతాయని నమ్మకం ఉంది.
తొమ్మిది నాగదేవతల పూజ
రాహు–కేతు లేదా కాలసర్ప దోషం ఉన్నవారు ఈ తొమ్మిది నాగదేవతల పేర్లు జపిస్తూ పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేయాలి:
అనంత, వాసుకి, ఆదిశేష, పద్మనాభ, కంబ, శంఖపాల, ధాత్ర, రాష్ట్ర, తక్షక, కాళీయ.
ఈ దేవతల పేర్లు జపిస్తూ పుట్టకు పూజ చేస్తే అద్భుత ఫలితాలు వస్తాయి.
రాశి పరంగా రాహు–కేతువులు అనుకూలంగా లేని వారు దేవాలయంలోని జంటనాగ విగ్రహాల వద్ద కూడా పూజ చేయాలి. ఆవుపాలు పోసి, నీటితో శుభ్రపరచి, పసుపు–కుంకుమ అర్పించాలి. పత్తి వస్త్రాన్ని పసుపుతో పూసి కుంకుమ బొట్లు పెట్టి నాగదేవతలకు అలంకరించాలి. పుష్పాలు సమర్పించి, మట్టి ప్రమిదలో దీపం వెలిగించి, జిల్లేడాకులు–బెల్లం నైవేద్యం ఉంచాలి. ఆపై తొమ్మిది ప్రదక్షణలు చేయాలి.
ఇలా పూజ చేస్తే రాశి సంబంధిత రాహు,కేతు దోషాలు తొలగుతాయి. నాగుల చవితి రోజు పుట్ట పూజ తప్పక చేయాలి. ఇది సంతానసౌభాగ్యం, ఆయురారోగ్యం, కుటుంబ వృద్ధి తీసుకువస్తుంది.
పాటించవలసిన నియమాలు
నాగుల చవితి రోజు కత్తులు, చాకులు వంటి పనిముట్లు వాడకూడదు. వండిన పదార్థాలు తినకూడదు; పచ్చి ఆహారమే తీసుకోవాలి. అప్పుడు నాగదేవతల అనుగ్రహం త్వరగా కలుగుతుంది.
ఆధ్యాత్మిక రహస్యం
పుట్టలో పాలు పోసే ఆచారంలో లోతైన ఆధ్యాత్మిక అర్థం ఉంది. పాలు అంటే సత్వగుణానికి ప్రతీక. పాము అంటే రజోగుణ,తమోగుణాల సంకేతం. పుట్టలో పాలు పోయడం అంటే మనలోని రజస, తమస గుణాలను తగ్గించి సత్వగుణాన్ని పెంపొందించుకోవాలని సూచన.
వేదాంత రహస్యం
ప్రతి మనిషి శరీరంలో కుండలినీ శక్తి అనే దివ్యశక్తి నిద్రిస్తుంది. యోగులు దానిని మేల్కొలిపితే ఆ శక్తి మూలాధార చక్రం నుండి పైకి లేస్తూ సహస్రార చక్రం వద్ద బ్రహ్మరంద్రాన్ని చేరుతుంది. అప్పుడు వారు దైవానుభూతిని పొందుతారు. ఈ కుండలినీ శక్తి పామువలె చుట్టుకొని ఉంటుంది; దానిని మేల్కొలిపే సంకేతమే పాముకు పాలు పోయడం.
వైజ్ఞానిక రహస్యం
పుట్టలో పాలు పోయడం వల్ల పిల్లలు పుడతారని ఒక శాస్త్రీయ కారణం కూడా ఉంది. పాములు పుట్ట చుట్టూ సంచరించే సమయంలో తమ రజస్సు లేదా రేతస్సును వదులుతాయి. ఆ పుట్టలో పాలు పోసినప్పుడు పాముల రేతస్సు, ఆవుపాలతో కలసి ఒక ప్రత్యేక వాయువు ఉత్పత్తి అవుతుంది. ఆ వాయువు మహిళల శరీరంలోని సంతాన సంబంధిత సమస్యలను తగ్గించి సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతుంది. అందుకే పుట్టలో పాలు పోయడం సంతానప్రాప్తికి అనుకూలమని విశ్వసిస్తారు.
కాబట్టి ఈ నాగుల చవితి (అక్టోబర్ 25 శనివారం) తప్పక పుట్టలో పాలు పోయండి, ఆధ్యాత్మిక,వేదాంత,వైజ్ఞానిక రహస్యాలను మనసారా తెలుసుకోండి.
ఈ రోజు ఈ శ్లోకం జపిస్తే కూడా మహత్తర ఫలితాలు లభిస్తాయి –
పాహి పాహి సర్పరూప నాగదేవ దయామయ।
సత్సంతాన సంపత్తిం దేహిమే శంకరప్రియ॥
అనంతాది మహానాగ రూప వరదాయ తుభ్యం నమామి।
భుజగేంద్ర సౌభాగ్యం దేహిమే సదా॥
ఈ శ్లోకంలో అర్థం – సర్పరూపంలో ఉన్న దయామయ నాగదేవతలారా, శంకరప్రియులారా, మాకు సత్సంతాన సంపదను ప్రసాదించండి. అనంత, వాసుకి, ఆదిశేష, పద్మనాభ, కంబ, శంఖపాల, ధాత్ర, రాష్ట్ర, తక్షక, కాళీయ రూపాలలో ఉన్న మహా నాగదేవతలారా, మీ కృపతో మాకు శుభసౌభాగ్యాలను ప్రసాదించండి.
పుట్ట చుట్టూ తిరుగుతూ ఈ శ్లోకం జపిస్తే సర్పదేవతల సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. పూర్తి శ్లోకం చదవలేని వారు ఈ తొమ్మిది నాగదేవతల పేర్లను జపించినా అదే ఫలితం పొందుతారు.
Also read : సర్ప సూక్తం





